డబ్ల్యూహెచ్ఓతో కరోనా వైరస్ సమాచారాన్నిపంచుకునే విషయంలో అమెరికా చేసిన ఆరోపణలను చైనా తిప్పికొట్టింది. 'కొవిడ్-19 విషయంలో అంతర్జాతీయ సహకారాన్ని అమెరికా ఇప్పటికే దెబ్బతీసింది. ఇప్పుడు ప్రపంచ ఆరోగ్య సంస్థకు నమ్మకంగా మద్దతిస్తోన్న దేశాలవైపు వేలెత్తి చూపుతోంద'ని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.
అమెరికా తిరిగి డబ్ల్యూహెచ్ఓలో చేరటంపై హర్షం వ్యక్తం చేసింది. డబ్ల్యూహెచ్ఓకు సహకారం అందించటంలో ఉన్నత విలువలు, బాధ్యతాయుతంగా, పారదర్శకతతో వ్యవహరిస్తుందనే నమ్మకం ఉన్నట్లు తెలిపింది.
తొలుత డేటా షేరింగ్ విషయంలో చైనా సహకరించడంలేదంటూ.. కరోనా ఆవిర్భావం గురించి తెలుసుకునేందుకు వూహాన్ వెళ్లిన డబ్ల్యూహెచ్ఓ శాస్త్రేవేత్తలు తెలిపారు. ఈ ఆరోపణలను సమర్థిస్తూ చైనా వైఖరిపై శనివారం మండిపడింది అమెరికా.
'కరోనా మూలాలు కనిపెట్టేందుకు చేస్తోన్న పరిశోధనకు సంబంధించిన నివేదిక స్వతంత్రంగా ఉండాలి. ఈ విషయంలో చైనా జోక్యం చేసుకోకపోవడం మంచిది' అని జాతీయ భద్రతా సలహాదారు జాక్ సలివన్ అన్నారు. రానున్న పరిణామాల దృష్ట్యా చైనా.. కరోనా వైరస్‌కు సంబంధించిన వివరాలను పంచుకోవాలని తెలిపారు. చైనా వ్యవహరించిన తీరుపై అసహనం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి:చైనాలో స్ప్రింగ్ ఫెస్టివల్- వీధులన్నీ కలర్‌ఫుల్