నేపాల్ సరిహద్దు భూములను ఆక్రమించినట్లు వస్తున్న వార్తలను చైనా ఖండించింది. తాము చేపట్టిన నిర్మాణాలు తమ భూభాగంలోకే వస్తాయని పేర్కొంది. వాస్తవానికి అవి టెబెట్లో కొత్తగా నిర్మించిన గ్రామంగా వివరించింది. నేపాల్‌కు చెందిన ఆక్రమిత భూమి కాదని చైనా అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ స్పష్టం చేసింది.
నేపాల్‌లోని హుమ్ల జిల్లాలోని సరిహద్దు భూములను చైనా ఆక్రమించి, నిర్మాణాలు చేపడుతున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఈ మేరకు స్పందించింది గ్లోబల్ టైమ్స్.
" నేపాల్‌లో కొందరు వారి భూములను ఆక్రమించినట్లు ఆరోపించిన నిర్మాణాలు చైనా భూభాగంలోకే వస్తాయి. వాస్తవానికి నైరుతి చైనాలోని స్వయం ప్రతిపత్తి గల టిబెట్‌లో కొత్తగా నిర్మించిన గ్రామం."
- గ్లోబల్ టైమ్స్, చైనా అధికారిక మీడియా.
నేపాల్‌లోని హుమ్ల జిల్లాకు చెందిన భూములను చైనా ఆక్రమించుకుందని ఆ దేశ విపక్ష నేత జీవన్ బహదూర్ షాహి రెండు రోజుల క్రితం సంచలన వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ప్రజలు అనేక విధాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారని.. ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆరోపించారు. అయితే.. ఈ వ్యాఖ్యలను తోసిపుచ్చింది ప్రధాని కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని ప్రభుత్వం.
ఇదీ చూడండి: 'నేపాల్ సరిహద్దు భూములను ఆక్రమించిన చైనా'