కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే లీక్ అయిందనే అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో.. అందుకు బలాన్నిచ్చే సమాచారాన్ని కప్పిపుచ్చేందుకు చైనా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా కరోనా జన్యుక్రమానికి సంబంధించిన తొలినాళ్ల నివేదికలను అంతర్జాతీయ డేటాబేస్ నుంచి చైనా తొలగిస్తున్నట్లు సమాచారం.
కొవిడ్ మూలాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ మరోసారి దర్యాప్తునకు సిద్ధమవుతోన్న వేళ చైనా యత్నాలను అమెరికా శాస్త్రవేత్తలు మరోసారి బయటపెట్టారు. కరోనా వైరస్ విజృంభించిన తొలినాళ్లలో చైనా విడుదల చేసిన వైరస్ టెస్ట్ సీక్వెన్సులను అంతర్జాతీయ డేటాబేస్‌ల నుంచి తొలగిస్తున్నట్లు అమెరికాలో ప్రముఖ వైరాలజిస్ట్ జెస్సీ బ్లూమ్ తెలిపారు. ముఖ్యంగా కరోనా మూలాలు కనిపించకుండా చేసేందుకే నేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (ఎన్‌ఐహెచ్)కు సంబంధించిన 'సీక్వెన్స్ రీడ్ ఆర్కైవ్' నుంచి వాటిని తొలగిస్తున్నట్లు పేర్కొన్నారు.
వైరస్ వెలుగుచూసిన సమయంలో వుహాన్‌లో నమోదైన కేసులకు సంబంధించిన నమూనాల సమాచారమే తొలగించిన వాటిలో ఎక్కువగా ఉందన్నారు. కొవిడ్ మూలాలు, విస్తృతిని అర్థం చేసుకోవడంలో అత్యంత కీలకమైన ఇటువంటి డజనుకుపైగా నివేదికలను చైనా తొలగించినట్లు తెలిపారు. వైరస్ పరిణామ క్రమంపై గందరగోళం సృష్టించడానికే చైనా ఈ పన్నాగాలు పన్నినట్లు భావిస్తున్నామన్నారు. వుహాన్‌లోని స్థానిక మార్కెట్‌లో కరోనా వైరస్ వెలుగుచూడక ముందే నగరంలో పలుచోట్ల వైరస్ ఆనవాళ్లు ఉన్నాయని పేర్కొన్నారు.
ఇవీ చదవండి: