ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ మరణాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. తాజాగా చైనాలో మరో 52 మంది చనిపోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 2,715 కు చేరింది. కొత్తగా 406 మందికి ఈ మహమ్మారి సోకగా.. మొత్తం వైరస్ బారిన పడిన వారి సంఖ్య 78,064 కు చేరుకుంది.
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ తగ్గుముఖం పడుతోందని చైనా ఆరోగ్య కమిషన్ వెల్లడించింది. ఇప్పటివరకు 29,745 మంది వైరస్ నుంచి విముక్తులై ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారని అధికారులు తెలిపారు. 6.47 లక్షల మందికి వైరస్ పరీక్షలు నిర్వహించినట్లు వివరించారు. 79వేల మంది వైద్య పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు.
ప్రపంచ వ్యాప్తంగా...
హాంకాంగ్‌లో వైరస్ సోకి ఇప్పటివరకు ఇద్దరు మరణించగా.. 85 కేసులు నమోదయ్యాయి. తైవాన్‌లో 31 మంది వైరస్ బారిన పడగా.. ఒకరు మృతిచెందారు. మకావూలో 10 మంది ఈ మహమ్మారి బారినడ్డారు.
చైనా, ఇరాన్‌పై అమెరికా ఆగ్రహం...
కరోనా వైరస్ వ్యాప్తి గురించి ప్రపంచదేశాలు ఆందోళన చెందుతున్న తరుణంలో... ఆ కేసులను బయటపెట్టకుండా చైనా, ఇరాన్‌లు ప్రయత్నిస్తున్నాయని అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో విమర్శించారు. రెండు ప్రభుత్వాలూ.. కేసులను కప్పిపెడుతున్నాయని ఆరోపించారు. వైరస్‌కు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేస్తూ... అంతర్జాతీయ సంస్థలకు సాయపడాలని సూచించారు.
పాత్రికేయులు తప్పనిసరి...
బీజింగ్‌లో ఇద్దరు రిపోర్టర్లను బహిష్కరించడాన్ని తీవ్రంగా ఖండించారు మైక్. ప్రజలకు కచ్చితమైన సమాచారాన్ని చేరవేసేందుకు పాత్రికేయులు తప్పనిసరిగా ఉండాలన్నారు పాంపియో.
ఇదీ చదవండి: కొరియాలోని అమెరికా జవానుకు కరోనా..