కరోనా నేపథ్యంలో చిలీలో రెండు క్రూయిజ్ షిప్‌లలో 1,300 మందిని నిర్బంధంలో ఉంచింది అక్కడి యంత్రాంగం. నౌకలోని బ్రిటన్‌కు చెందిన ఓ వృద్ధుడికి కరోనా సోకడం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది. సిల్వర్ ఎక్స్‌ప్లోరర్ నౌకలో ప్రయాణిస్తున్న 85ఏళ్ల వ్యక్తికి కరోనా లక్షణాలు కనిపించడం వల్ల దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. పరీక్షల్లో కరోనా పాజిటివ్ అని తేలిందని చిలీ ఆరోగ్య శాఖ మంత్రి జైమీ మనాలిచ్ తెలిపారు. పాటగోనియా తీరంలోని చిలీ లోయల్లో ఈ రెండు నౌకలు ప్రయాణిస్తున్నట్లు చెప్పారు.
రెండో నౌక 'అజ్మరా పర్స్యూట్'లో 665 మంది ప్రయాణికులు, 400 మంది సిబ్బంది ఉన్నారు. చిలీ సముద్ర జలాలను దాటి దక్షిణ అర్జెంటీనాకు దగ్గర్లోని ఉశ్వాయా తీరంలోకి ప్రవేశించినట్లు మనలిచ్ వెల్లడించారు. కరోనా సోకిన వ్యక్తులు నౌకలో ఉన్నారన్న అనుమానంతో ప్రయాణికులు దిగేందుకు అక్కడి అధికారులు అనుమతించడం లేదని పేర్కొన్నారు. దీంతో నౌకను చాకాబుకో తీరంలో నిలిపివేసినట్లు చెప్పారు. బ్యూన ఎరిస్ నుంచి పెరులోని కాలావ్ వరకు ఈ నౌక వెళ్తున్నట్లు సమాచారం. ఇది 21 రోజులుగా ప్రయాణంలో ఉంది.
శుక్రవారం నమోదైన 18 కేసులతో చిలీలో కరోనా బాధితుల సంఖ్య 61కి చేరింది. విదేశాల నుంచే కాకుండా స్థానికంగానూ కేసులు ఉండే అవకాశం ఉందన్నారు.
వైరస్ ప్రబలకుండా చిలీ పలు జాగ్రత్తలు తీసుకుంటోంది. 500 మందికి పైగా పాల్గొనే కార్యక్రమాలను రద్దు చేసింది. ఉద్యోగులకు ఇంటి నుంచే పని చేసే విధంగా వీలు కల్పించింది. ఓ ప్రైవేట్ స్కూల్ కార్యక్రమంలో పాల్గొన్న 2,600 మంది విద్యార్థులను నిర్బంధంలో ఉంచింది.
ఆగిన గోల్డెన్ ప్రిన్సెస్
న్యూజిలాండ్‌లో కరోనా కారణంగా గోల్డెన్ ప్రిన్సెస్ నౌకను తీరంలోనే నిలిపివేశారు. ప్రయాణికుల్లో ఒకరికి వైరస్ లక్షణాలు కనిపించినట్లు అధికారులు తెలిపారు. అనుమానాస్పద కేసుగా పరిగణిస్తున్నారు. నౌకలో 2,600 మంది ప్రయాణికులు, 1,100 మంది సిబ్బంది ఉన్నారు. గోల్డెన్ ప్రిన్సెస్‌ను క్రైస్ట్‌చర్చ్ సమీపంలోని అకరోవా తీరంలో నిలిపి ఉంచినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా పరీక్షల ఫలితాలు వెల్లడైన తర్వాతే వారిని అనుమతించనున్నట్లు స్పష్టం చేశారు.
అయితే కరోనా భయంతో ప్రయాణికులను నౌకలోనే నిర్బంధించడం సరికాదని న్యూజిలాండ్ వైద్య నిపుణుడు బ్రియాన్ కాక్స్ తెలిపారు. గోల్డెన్ ప్రిన్సెస్‌లో కరోనా పాజిటివ్ నమోదైతే మిగిలిన ప్రయాణికులను నౌకలో నుంచి బయటకు తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. జపాన్‌లో డైమండ్ ప్రిన్సెస్ నౌకను నిర్బంధించినప్పుడు ప్రతికూల ప్రభావం ఏర్పడిందని అన్నారు.
విదేశాల నుంచి వచ్చిన ప్రయాణికులు 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలని న్యూజిలాండ్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఆస్ట్రేలియా సైతం ఇదే తరహా నిర్ణయం ప్రకటించింది.
అక్కడా ఇదే పరిస్థితి!
మరోవైపు లాటిన్ అమెరికాలో పలు దేశాలు కఠిన చర్యలు అమలు చేస్తున్నాయి. కరోనా నియమాలను పాటించనివారిపై కొలంబియా.. దేశబహిష్కరణ వేటు వేసింది. ఫ్రాన్స్‌కు చెందిన ఇద్దరు, స్పెయిన్‌కు చెందిన ఇద్దరిని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకుంది.
దేశంలో రెండో కరోనా మరణం సంభవించడం వల్ల ఈక్వెడార్ తన అంతర్జాతీయ సరిహద్దులను మూసేస్తున్నట్లు ప్రకటించింది.
ఐరోపాకు నేరుగా విమానాలను నిలిపివేస్తున్నట్లు బొలీవియా నిర్ణయం తీసుకుంది. చైనా, దక్షిణ కొరియా, ఇటలీ, స్పెయిన్ దేశాల పర్యటకులకు అనుమతి నిషేధించింది.
ఐరోపా దేశాలకు విమాన సర్వీసులను రద్దు చేసిన పనామా... తాజాగా ఆసియా దేశాలనూ ఆ జాబితాలో చేర్చింది.
వెనుజులా, మెక్సికో, ఎల్‌సాల్వడార్, గ్వాటెమాలా, ఉరుగ్వే దేశాల్లో పాఠశాలలను ముసేశారు. ఇప్పటివరకు లాటిన్ అమెరికా దేశాల్లో కరోనా కారణంగా ఆరుగురు మృతి చెందగా.. 430 మందికి వైరస్ సోకింది.