దక్షిణ ఫిలిప్పీన్స్లోని జోలో నగరంలో వరుస బాంబు దాడులు పెను విషాదం నింపాయి. గంట వ్యవధిలోనే రెండు చోట్ల బాంబులు పేలి.. 14 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో సైనికులు, పోలీసులు సహా స్థానిక పౌరులు ఉన్నారు. మరో 75 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు.
నగరంలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అనుంబంధ తిరుగుబాటుదారులు ఆత్మాహుతి దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఇప్పటికే భారీగా బలగాలు మోహరించారు అధికారులు. అయినప్పటికీ ఈ దాడులు జరిగాయి.
- తొలి దాడి.. సులు రాష్ట్రం జోలో పట్టణంలోని ఓ దుకాణం ముందు నిలిపి ఉంచిన రెండు ఆర్మీ ట్రక్కులపై జరిగింది. బాంబులు అమర్చిన ద్విచక్రవాహనాన్ని పేల్చేశారు దుండగులు. ఈ దాడిలో సైనికులతో పాటు స్థానిక పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
- రెండో దాడి.. మొదటి దాడికి అతి సమీపంలో గంట వ్యవధిలోనే జరిగింది. నగరంలోని రోమన్ క్యాథలిక్ క్యాథడ్రల్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సైనికుల వద్దకు ఓ మహిళ బాంబులతో వచ్చి పేల్చుకుంది.
- మూడో బాంబు.. పబ్లిక్ మార్కెట్ సమీపంలో అమర్చగా.. అది పేలకముందే గుర్తించి నిర్వీర్యం చేశారు అధికారులు. బాంబు దాడుల నేపథ్యంలో జోలో నగరంలో పూర్తిస్థాయిలో లాక్డౌన్ విధించి.. భారీగా బలగాలను మోహరించారు.
అయితే.. ఈ దాడులకు ఏ ఉగ్రసంస్థ బాధ్యత వహించలేదు. కానీ... అబు సయ్యాఫ్ మిలిటెంట్ కమాండర్ ముండి సవాడ్జాన్ ఈ దాడులు చేపట్టినట్లు సైనిక అధికారులు ఆరోపించారు. గతవారం సులులో ఇద్దరు మహిళలతో ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: 'ఇంకా ఎక్కువ మందినే కాల్చాలనుకున్నా!'