కరోనా మహమ్మారి యావత్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. దీని ప్రభావం భవిష్యత్తులో పేదరికాన్ని పెంచే అవకాశముంది. అందుకే, పేదరిక నిర్మూలనకు సరైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్ని దేశాలకు సూచించింది ఐక్యరాజ్య సమితి. పేదరిక నిర్మూలనలో భారత్ సహా 65 దేశాలు పాటించిన ప్రమాణాలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చింది.
ఐరాస అభివృద్ధి కార్యక్రమం, ఆక్స్ఫర్డ్ పేదరికం, మానవ అభివృద్ధి కార్యక్రమం విడుదల చేసిన ఓ నివేదిక ప్రకారం.. భారత్లో గత పదేళ్లలో అంటే 2005-06 నుంచి 2015-16 వరకు దాదాపు 27 కోట్ల 30 లక్షల మంది పేదరికం నుంచి బయటపడ్డారు .
20 ఏళ్ల క్రితం పేదరికంలో మగ్గిన 75 దేశాల్లో దాదాపు 65 దేశాలు పేదరిక నిర్మూలనలో పురోగతి సాధించాయి. వాటిలో భారత్ ముందంజలో ఉంది. ప్రస్తుతం దేశంలో పేదరికం నుంచి బయటపడినవారు సరైన ఆరోగ్యం, అక్షరాస్యత, తగినంత జీవన ప్రమాణాలు, ఉపాధితో పాటు సురక్షిత ప్రాంతాల్లో నివసించగలుగుతున్నారు.
భారత్ సహా.. బంగ్లాదేశ్, బొలీవియా, ఎస్వాతిని, గాబన్, గాంబియా, గయానా, లైబీరియా, మాలి, మొజాంబిక్, నైజర్, నేపాల్, రువాండా, నికరాగువా వంటి దేశాలు పేదరిక నిర్మూలనలో కీలక విజయాన్ని సాధించాయి.
అభివృద్ధి చెందుతున్న 107 దేశాల్లోని దాదాపు 130 కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారు. వీరిలో సగం మంది 18 ఏళ్లు కూడా నిండనివారే. 10.7 కోట్ల మంది మాత్రం 60 ఏళ్లు పైబడినవారు.
ఇదీ చదవండి: ఐరాస పేదరిక నిర్మూలన కూటమిలో భారత్కు చోటు