నేత్ర వైద్యంలో సంచలనం సాధ్యమైంది. ప్రపంచంలోనే తొలిసారిగా త్రీడీ రెటీనాతో హాంకాంగ్ శాస్త్రవేత్తలు కృత్రిమ నేత్రాలను అభివృద్ధి చేశారు. ప్రస్తుతమున్న బయోనిక్ కళ్ల కంటే వీటి పనితీరు మెరుగ్గా ఉంటుందని వారు వెల్లడించారు. హాంకాంగ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం దీన్ని ఆవిష్కరించింది. ప్రస్తుతమున్న 2డీ కృత్రిమ నేత్రాల పనితీరు అంతంత మాత్రమే. పైగా కళ్లద్దాల సాయం, రకరకాల ఏర్పాట్లు తప్పనిసరి. అయితే తాము తయారుచేసిన ఎలక్ట్రో-కెమికల్ నేత్రాలు రూపంలోనూ, నిర్మాణంలోనూ నిజమైన కళ్లను పోలి ఉండటమే కాకుండా, సహజనేత్రాలకు మించి మంచి చూపును అందించగలవని పరిశోధకులు చెప్పారు. రాత్రి వేళల్లో పరారుణ కిరణాలను కూడా అవి గుర్తించే వీలుందన్నారు.
ఇదంతా నిజమైన ఫొటోరిసిప్టర్‌ను పోలి ఉండే త్రీడీ కృత్రిమ రెటీనా, నానోవైర్లతో సాధ్యమైందని పరిశోధనకు నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఫాన్ జియాంగ్ తెలిపారు. మరింత మెరుగుపరిచి, భవిష్యత్తులో మనుషులకు అమర్చేలా వీటిని తీర్చిదిద్దుతామన్నారు. కాలిఫోర్నియా, బెర్కెలో వర్సిటీ శాస్త్రవేత్తలు కూడా పాలుపంచుకున్న ఈ పరిశోధనపై నేచర్ పత్రిక వివరాలు అందించింది.
ఇదీ చూడండి: అత్యుత్తమ విద్యాలయాల జాబితాలో భారత్కు చోటు