చైనాకు వ్యతిరేకంగా నిరసనలకు దిగారు పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్ ప్రజలు. నీలమ్, జీలమ్ నదులపై పాకిస్థాన్-చైనా అక్రమంగా నిర్మిస్తున్న ఆనకట్టలపై తమ ఆందోళన వ్యక్తం చేశారు.
నీలమ్, జీలమ్, కోహల హైడ్రో ప్రాజెక్టులకు వ్యతిరేకంగా సోమవారం భారీ ఎత్తున ర్యాలీ చేపట్టారు ప్రజలు. ఆనకట్టల నిర్మాణంతో పర్యావరణానికి జరిగే నష్టంపై గళం విప్పారు.
చైనా, పాకిస్థాన్ ప్రభుత్వాలు, చైనా కంపెనీల మధ్య ఇటీవలే ఓ త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా కోహలలో 2.4 బిలియన్ డాలర్ల ఖర్చుతో 1,124 మెగావాట్ హైడ్రోపవర్ ప్రాజెక్ట్ను నిర్మించనున్నారు.
అయితే ఈ వివాదాస్పద ప్రాంతంలో ఏ చట్టాన్ని పరిగణించి ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నారని నిరసనకారులు ప్రశ్నిస్తున్నారు. ఐరాస భద్రతా మండలి తీర్మానాన్ని చైనా, పాక్ ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయని ఆరోపించారు.
సీపెక్(చైనా పాకిస్థాన్ ఎకనామిక్ కారిడర్) పేరుతో చైనా తమపై ఆధిపత్యాన్ని చెలాయిస్తోందని ఇప్పటికే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు పాక్ ఆక్రమిత కశ్మీర్ ప్రజలు.
ఇదీ చూడండి:- 'చైనా వెనక్కి తగ్గినా.. భారత్ అప్రమత్తంగానే ఉండాలి'