Afghanistan Taliban: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల అరాచక పాలన కొనసాగుతోంది. ఇప్పటికే అక్కడి ప్రభుత్వం.. సామాన్య పౌరులు, మహిళల హక్కులను కాలరాస్తూ అనేక ఆంక్షలు విధిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు దేశంలో ఎన్నికలనే మాట రాకుండా చేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే అధ్యక్ష, పార్లమెంట్, ప్రావిన్స్‌లలో కౌన్సిల్ ఎన్నికలు నిర్వహించే ఎన్నికల సంఘాన్ని తాలిబన్ సర్కార్ రద్దు చేసింది. ఇండిపెండెంట్ ఎలక్షన్ కమిషన్‌తోపాటు ఎలక్టోరల్ కంప్లైంట్ కమిషన్‌ను కూడా రద్దు చేసినట్లు ప్రభుత్వ అధికార ప్రతినిధి బిలాల్ కరిమీ తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం అఫ్గానిస్థాన్‌లోని పరిస్థితుల దృష్ట్యా ఈ ఎన్నికల సంఘాలు అనవసరమని ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో ఎన్నికల సంఘం అవసరం ఏర్పడితే ప్రభుత్వం దానిని తిరిగి పునరుద్ధరిస్తుందని చెప్పారు. తాలిబన్ల ప్రభుత్వంలో ఎన్నికల ప్రస్తావనే ఉండదు కాబట్టి.. వీటిని రద్దు చేసినట్లు రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల సంఘాలతోపాటు దేశంలో శాంతిని నెలకొల్పడమే లక్ష్యంగా ఏర్పడిన శాంతి మంత్రిత్వ శాఖ, అలాగే.. పార్లమెంటరీ వ్యవహారాల శాఖను సైతం రద్దు చేస్తున్నట్లు బిలాల్ వెల్లడించారు. ఇప్పుడున్న ప్రభుత్వంలో ఈ మంత్రిత్వ శాఖలు కూడా అనవసరమని పేర్కొన్నారు.
అంతేకాదు, మహిళలపై తాలిబన్ ప్రభుత్వం మరికొన్ని ఆంక్షలను విధించింది. 72 కి.మీ దాటి ప్రయాణం చేయాలనుకునే మహిళలకు.. తోడుగా దగ్గరి మగ బంధువు ఉంటే తప్ప రవాణా సౌకర్యం కల్పించబోమని స్పష్టం చేసింది. హిజాబ్ ధరించిన మహిళలను మాత్రమే ఎక్కించుకోవాలని వాహన యజమానులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి : ఓ వైపు చలి.. మరోవైపు ఆకలి కేకలు.. అఫ్గాన్‌లో దుర్భర పరిస్థితులు