దట్టమైన అడవిలో కొంతసేపు గడపాలంటేనే మనం భయపడిపోతాం. క్రూరమృగాల హాని, ఆకలి దప్పికలు.. ఇవన్నీ ఆలోచిస్తూ కంగారుపడిపోతాం. కానీ తల్లిదండ్రుల నుంచి తప్పిపోయిన ఓ చిన్నారి.. అడవిలో మూడు రోజులు గడిపాడు. మూడేళ్ల ఆ బాలుడు.. నీరు ఎక్కడుందో వెతుక్కోని మరీ దాహం తీర్చుకున్నాడు. ఈ ఘటన ఆస్ట్రేలియాలోని (australia toddler found) న్యూ సౌత్ వేల్స్లో జరిగింది.
న్యూ సౌత్ వేల్స్లోని పుట్టీ గ్రామానికి చెందిన మూడేళ్ల ఆంటోనీ ఏజే ఎల్ఫలాక్.. శుక్రవారం తప్పిపోయాడు. ఆటిజం వ్యాధితో బాధపడుతున్న తమ కుమారుడు కనిపించకపోవడంపై ఆందోళ చెందిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారులు సహా అక్కడున్న స్థానికులు కూడా చిన్నారి కోసం గాలించారు. ఈ క్రమంలో సోమవారం, హెలికాప్టర్లో సమీపంలోని అడవుల్లో గాలిస్తుండగా.. ఓ గుంటలో నీరు తాగుతూ బాలుడు కనిపించాడు. ఆ ప్రదేశం బాలుడి ఇంటికి 470 మీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఇది మిరాకిల్..!
బాలుడి ఆచూకీపై తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. తన కుమారుడు మూడు రోజుల పాటు సరైన ఆహారం లేకున్నా జీవించి ఉండటం ఓ మిరాకిల్ అని బాలుడి తండ్రి పేర్కొన్నారు. అడవిలో ఒంటరిగా ఉన్నా ధైర్యంగా ఉండటం, శరీరం డీహైడ్రేట్ కాకుండా నీరు ఎక్కడుందో వెతుక్కోని మరీ బాలుడు ఎప్పటికప్పుడు దప్పిక తీర్చుకున్న విషయాన్ని తెలుసుకుని ఆశ్చర్యపోయామన్నారు. 6 డిగ్రీల ఉష్ణోగ్రతలను బాలుడు తట్టుకోగలిగాడని తెలిపారు.
అనంతరం బాలుడికి పరీక్షలు నిర్వహించారు. బాలుడు ఆరోగ్యంగానే ఉన్నాడని వైద్యులు వెల్లడించారు.
ఇదీ చదవండి : అండర్వేర్ల దొంగ.. లాండ్రీ నుంచి 730 లోదుస్తులు చోరీ