వేల మందిని బలిగొన్న కరోనా మహమ్మారి దాడి నుంచి పూర్తిగా కోలుకోకముందే.. చైనాలో మరో విపత్తు సంభవించింది. సిచువాన్ రాష్ట్రంలో కార్చిచ్చు చెలరేగి 19 మంది ప్రాణాలు కోల్పోయారు.
స్థానిక కాలమానం ప్రకారం సోమవారం తెల్లవారుజామున 3:51నిమిషాలకు మొదలైందీ కార్చిచ్చు . భీకర గాలులు తోడవగా... అగ్నికీలలు వేగంగా విస్తరించాయి. మంటలను అదుపుచేసేందుకు రంగంలోకి దిగిన 18 మంది అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. వారికి దారి చూపేందుకు వెళ్లిన స్థానిక రైతు సైతం మృతి చెందాడు.
ప్రస్తుతం సుమారు 300 మంది అగ్నిమాపక సిబ్బంది, 700 మంది సైనికులు మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. కార్చిచ్చుకు అసలు కారణం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.
గతేడాది ఇదే సిచువాన్‌లో కార్చిచ్చు చెలరేగింది. ఆ ఘటనలో 27మంది సహాయ సిబ్బందితో కలిపి మొత్తం 30 మంది ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి:కలిసి కట్టుగా ఒకే జట్టుగా కరోనాపై జీ-20 పోరు