అమెరికాలో ఈ ఏడాది చివరి నాటికి సురక్షితమైన, సమర్థవంతమైన కొవిడ్-19 వ్యాక్సిన్ అందుబాటులోకి తీసుకొస్తామన్నారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తిరిగి ఎన్నికైతే కార్పొరేట్ రంగానికి అవకాశాలు కల్పించి వృద్ధి చెందేలా కృషి చేస్తామన్నారు.
కరోనాబారి నుంచి కోలుకున్న తర్వాత అధ్యక్ష ఎన్నికల ప్రచారాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు ట్రంప్. ఎకనామిక్ క్లబ్ ఆఫ్ న్యూయార్క్, చికాగో, ఫ్లోరిడా, పిటస్బర్గ్, షెబాయ్గాన్, వాషింగ్టన్ క్లబ్‌లతో శ్వేతసౌధంలో సమావేశమైన సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
" ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఎవరిని ఎన్నుకోవాలి అనేది సులభం. ఓ వైపు నా పాలనలో అమెరికా అనుకూల విధానాలతో చారిత్రక అభివృద్ధి ఉంది.. మరోవైపు వామపక్ష తీవ్రవాదుల పాలనలోని తీవ్ర పేదరికం, ఆర్థిక మాంద్యాలు ఉన్నాయి. ఏది కావాలో మీరే ఎంచుకోండి. వారు(డెమొక్రాట్లు) నిరాశావాదం, స్తబ్దత, క్షీణత, అధిక పన్నులను ఇస్తారు. సూటిగా చెప్పాలంటే ఇది అమెరికన్ల కల, సోషలిస్ట్ పీడకలల మధ్య ఎంపిక. నా నాయకత్వంలో ఈ ఏడాది చివరి నాటికి సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. చైనా వైరస్‌ను ఓడిస్తాం. సరఫరా గొలుసును తిరిగి గాడినపెడతాం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఆర్థిక వ్యవస్థను సరికొత్త శిఖరాలకు చేరుస్తాం. "
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
వామపక్షాలు అధికారంలోకి వస్తే ఆర్థిక వ్యవస్థ పతనం, పాఠశాలలను మూసివేయటం, వ్యాక్సిన్ ఆలస్యం, మహమ్మారిని మరింత కాలం పొడిగించటం సహా దేశ చరిత్రలో అత్యంత తీవ్రమైన విధానాలను అమలు చేస్తారని ఆరోపించారు ట్రంప్. తమ నాలుగేళ్ల పాలనలో 6.6 మిలియన్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని, 7 మిలియన్ల ఉద్యోగాలు సృష్టించినట్లు కొనియాడారు. చైనా దురాక్రమణలపై కఠినమైన చర్యలు తీసుకున్నానని మరోమారు ఉద్ఘాటించారు.
ఇదీ చూడండి: కరోనాకు రష్యా రెండో వ్యాక్సిన్ రెడీ