కరోనా విషయంలో చైనాను పదే పదే విమర్శిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఆ దేశంపై విరుచుకుపడ్డారు. చైనా పెద్ద తప్పు చేయడం వల్లనో లేక అసమర్థత కారణంగానో ప్రపంచమంతా మహమ్మారి విస్తరించిందని ఆరోపించారు.
"ప్రాణాంతక వైరస్‌ను ప్రారంభ దశలోనే ఆపి ఉండొచ్చు. అలా చేయడం సులభం కూడా. కానీ ఏదో జరిగింది. ఏదో జరిగింది." అని ట్రంప్ తన అనుమానాలను బయటపెట్టారు. "వారు ఏదో ఘోరమైన పొరపాటు చేసుంటారు. అది వారి చేతకానితనం వల్ల కావొచ్చు. అది చాలా బాధాకరం" అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు ట్రంప్.
ప్రతి రోజు పరీక్ష..
ట్రంప్ సైనిక సలహాదారుడికి కరోనా పాజిటివ్‌గా తేలిన నేపథ్యంలో ప్రతి రోజు తాను వైరస్ పరీక్షలు చేయించుకుంటున్నానని అమెరికా అధ్యక్షుడు వెల్లడించారు. తనతో పాటు శ్వేతసౌధంలోని సిబ్బంది అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి:'మహా' ప్రమాదంపై మోదీ, వెంకయ్య దిగ్భ్రాంతి