అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నిక నవంబరు 4న జరిగితే.. కొత్త అధ్యక్షుడి పదవీ స్వీకారానికి జనవరి 20 దాకా ఎందుకు ఆగాలి? అమెరికాలో తాజాగా జరిగిన అరాచకపు సంఘటన నేపథ్యంలో అమెరికన్లతో పాటు యావత్ ప్రపంచమంతటి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇది! అంతేగాకుండా భవిష్యత్‌లో అమెరికా రాజ్యాంగ సవరణతో మారే అవకాశం ఉన్న ఈ నిబంధన గురించి లోతుగా చూస్తే ఆసక్తికరాంశాలే ఉన్నాయి.
- అమెరికా రాజ్యాంగ నిర్మాతలు- తమ దేశ అధ్యక్షుడి పదవీకాలం ఎప్పుడు పూర్తవుతుందో స్పష్టంగా చెప్పలేదు. అధ్యక్షుడి పదవీకాలం నాలుగేళ్ళు అని మాత్రమే రాజ్యాంగంలో రాశారు.
- 1788 సెప్టెంబరులో అమెరికా రాజ్యాంగాన్ని ఆమోదించినప్పుడు.. 1789, మార్చి 4న కొత్త ప్రభుత్వం అధికారం చేపట్టాలని ఆదేశించారు. నవంబరులో ఎన్నిక జరిగితే మార్చి దాకా ఎందుకింత సమయం అనే ప్రశ్న అప్పుడే ఉత్పన్నమైంది.
- ప్రతినిధుల సభ, సెనెట్‌కు ఎన్నికలు నిర్వహించుకొని.. అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడితో పాటు.. అంతా చలికాలంలో న్యూయార్క్‌కు రావటానికి సమయం పడుతుందనే ఉద్దేశంతో ఆ సమయం కేటాయించారు.
- ఎన్నికైన తొలి అమెరికా ప్రభుత్వం నిజానికి నిర్దేశించిన 1789 మార్చి 4న కూడా కొలువుదీరలేకపోయింది. ఏప్రిల్ 1న ప్రతినిధుల సభలో, ఏప్రిల్ 5న సెనెట్‌లో కోరం కుదరగా.. ఏప్రిల్ 30న జార్జి వాషింగ్టన్ తొలి అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశారు.
- అయితే ఆ తర్వాత 1792 నుంచి మాత్రం 140 సంవత్సరాల పాటు నిరాటంకంగా.. మార్చి 4నే కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరిగింది.
- అయితే.. ఎన్నికలు పూర్తయిన నాలుగు నెలల దాకా పాత ప్రభుత్వమే పనిచేయటం.. నిర్ణయాలు తీసుకోవటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదంటూ సెనెటర్ జార్జి నోరిస్ నెబ్రాస్కా ప్రతిపాదించారు. దాదాపు 16 సంవత్సరాల పాటు ఆయన దీనిపై పోరాటం చేశారు.
- దీంతో.. 1933లో అమెరికా రాజ్యాంగాన్ని సవరించారు. దీన్నే 20వ సవరణగా చెబుతారు. దీని ప్రకారం.. 1934 నుంచి కొత్త పార్లమెంటు (ప్రతినిధుల సభ, సెనెట్) జనవరి 3న కొలువుదీరటం మొదలైంది. 1937 నుంచి కొత్త అధ్యక్షుడి ప్రమాణం మార్చి 4 నుంచి జనవరి 20కి మార్చారు. అంటే జనవరి 20 మధ్యాహ్నం పాత అధ్యక్షుడి పదవీకాలం ముగుస్తుంది.
ఇదీ చదవండి : కొత్త అధ్యక్షుడు బైడెన్ తీరని కోరిక!