వేగంగా వ్యాపిస్తున్న కరోనాపై ప్రపంచాన్ని హెచ్చరించింది ఐక్యరాజ్య సమితి ఆరోగ్య సంస్థ. ఈ ప్రాణాంతక వైరస్‌తో పోరాడే క్రమంలో ప్రపంచం ఎటూ పాలుపోని స్థితిలోకి వెళ్లిందని ఆవేదన వ్యక్తం చేసింది. 2 నుంచి 5 శాతం మధ్య మరణాల రేటున్న కరోనా వైరస్.. ముఖ్యంగా వృద్ధలు లేదా అప్పటికే ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారికి సోకుతోందని స్పష్టం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ).
చైనాలో తగ్గుముఖం కానీ...
కరోనా కేంద్ర బిందువైన చైనాలో రోజురోజుకు వైరస్ కొత్త కేసులు తగ్గుతున్నప్పటికీ.. ఇతర దేశాల్లో మాత్రం గణనీయంగా పెరుగుతున్నాయి. తాజాగా అగ్రరాజ్యం అమెరికాలో కొవిడ్-19 మరణాల సంఖ్య ఆరుకు చేరింది. ఈ వైరస్ బారినపడి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3,100 మంది ప్రాణాలు కోల్పోయారు.
చైనా తర్వాత దక్షిణ కొరియా, ఇరాన్, ఇటలీ దేశాల్లో అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. చైనాలో ఇవాళ ఒక్కరోజే 125 కొత్త కేసులు నమోదుకాగా.. దక్షిణ కొరియాలో ఏకంగా 851 కేసులు వెలుగు చూశాయి.
66 మంది మృతులతో పాటు 1500కు పైగా కేసులతో పోరాడుతున్న ఇరాన్లో కరోనాను నియంత్రించేందుకు యూఎన్ వైద్య నిపుణుల బృందం సోమవారం ఆ దేశానికి చేరుకుంది. యూరప్ ఖండంలోనే ఇటలీలో అత్యధికంగా 1700 కరోనా కేసులు నమోదుకాగా.. 52 మంది మృత్యువాతపడ్డారు.