అల్ప, మధ్యాదాయ దేశాలకు 12 కోట్ల కరోనా ర్యాపిడ్ టెస్టింగ్ కిట్లను అందించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ నడుం కట్టింది. భాగస్వామ్య సంస్థలతో కలిసి వీటిని సరఫరా చేసేందుకు సిద్ధమైంది. పీసీఆర్ పరీక్షలు నిర్వహించలేదని దేశాలకు వచ్చే నెలలో వీటిని అందించేందుకు కసరత్తులు చేస్తున్నట్లు డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది.
యాంటీజెన్ ఆధారిత ఒక్కో డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్ కోసం 5 డాలర్లను డబ్ల్యూహెచ్ఓ ఖర్చు చేయనుంది. ఈ కార్యక్రమం కోసం 600 మిలియన్ డాలర్ల నిధులు అవసరమవుతాయని సంస్థ తెలిపింది. అయితే ఈ నిధులు పూర్తిగా అందలేదని పేర్కొంది.
మంచి వార్త!
ఈ కార్యక్రమం ప్రారంభించడంపై డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ హర్షం వ్యక్తం చేశారు. కొవిడ్ పోరులో ఇది ఓ 'శుభ వార్త' అని పేర్కొన్నారు.
"ఎలాంటి అధునాతన పరికరాలు లేకుండా, తక్కువ ధరలో, 15-30 నిమిషాల వ్యవధిలోనే ఈ పరీక్షలు నమ్మకమైన ఫలితాలు అందిస్తాయి. పీసీఆర్ పరీక్షలు నిర్వహించలేని ప్రాంతాలతో పాటు ల్యాబ్ సౌకర్యాలు లేని ప్రాంతాల్లో కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఇవి దోహదం చేస్తాయి. దీనిపై ఒప్పందం కుదిరింది. కిట్ల కొనుగోలుకు పూర్తి నిధులు అందాల్సి ఉంది."
-టెడ్రోస్ అధనోమ్, డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్
ఆఫ్రికాలోని 20 దేశాల్లో ఈ కిట్లను పంపిణీ చేసే యోచనలో ఉన్నట్లు ఫౌండేషన్ ఫర్ ఇన్నోవేటివ్ న్యూ డయాగ్నోస్టిక్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డా. కేథరీనా బొహ్మె తెలిపారు. క్లింటన్ హెల్త్ యాక్సెస్ ఇనిషియేటివ్ సంస్థ సహకారంతో వీటిని అందించనున్నట్లు చెప్పారు. ఎస్డీ బయోసెన్సార్, అబాట్ సంస్థలు డయాగ్నోస్టిక్ టెస్ట్ కిట్లను అందిస్తాయని వెల్లడించారు.
భారీ అంతరం
12 కోట్ల కిట్ల ద్వారా అల్పాదాయ దేశాల్లో కరోనా పరీక్షల సంఖ్య పెరుగుతుందని మహమ్మారి నివారణ కోసం పనిచేస్తున్న 'గ్లోబల్ ఫండ్' ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పీటర్ శాండ్స్ పేర్కొన్నారు. అయితే ఆ దేశాలకు అవసరమైన దానితో పోలిస్తే కిట్ల సంఖ్య చాలా తక్కువేనని అభిప్రాయపడ్డారు. ఆదాయం అధికంగా ఉన్న దేశాల్లో లక్ష మందికి రోజుకు సగటున 292 టెస్టులను చేస్తున్నారని.. అల్పాదాయ దేశాల్లో ఈ సంఖ్య కేవలం 14గా ఉందని తెలిపారు.
సులభమే కానీ...
కరోనా నిర్ధరణకు అత్యుత్తమంగా భావిస్తున్న పీసీఆర్ టెస్టులతో పోలిస్తే ఈ ర్యాపిడ్ కిట్లు అత్యంత వేగంగా ఫలితాలను ఇస్తాయి. పీసీఆర్ పరీక్షలకు ప్రత్యేక ల్యాబరేటరీ, అధునాతన పరికరాలు అవసరమవుతాయి. ర్యాపిడ్ టెస్టుల కోసం ఎలాంటి భారీ పరికరాల అవసరం లేకుండానే సులభంగా నిర్వహించవచ్చు. అయితే పీసీఆర్తో పోలిస్తే ర్యాపి[d టెస్టుల ఫలితాల్లో కచ్చితత్వం తక్కువగా ఉంటుంది.
ఇదీ చదవండి- మూడు గంటల్లో కరోనాను ఖతం చేసే షీటు!