మయన్మార్‌లో సైనిక తిరుగుబాటుపై ఆ ప్రాంతంలోని దేశాల స్పందనను గమనిస్తున్నామని అగ్రరాజ్యం పేర్కొంది. ప్రస్తుత సమయంలో మయన్మార్‌కు అండగా నిలిచిన దేశాలను గుర్తించామని అధ్యక్షుడు బైడెన్ తెలిపారు. ఈ సందర్భంగా సైనిక తిరుగుబాటును తీవ్రంగా ఖండించారు.
"మయన్మార్‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి ఆ ప్రాంతంలోని మా భాగస్వామ్య దేశాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిత్ర దేశాలతో కలిసి పనిచేస్తాం. ప్రజాస్వామ్యానికి బదిలీ కావడాన్ని వ్యతిరేకిస్తూ ఈ చర్యకు పాల్పడినవారిని జవాబుదారీని చేసేందుకు పనిచేస్తాం."
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
బైడెన్ చేసిన ప్రకటన చైనాను ఉద్దేశించిదేనా అని పాత్రికేయులు శ్వేతసౌధ వివరణ కోరగా.. ఈ సందేశం ఆ ప్రాంతంలోని అన్ని దేశాలకు వర్తిస్తుందని వైట్‌హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ సాకి పేర్కొన్నారు. గత రెండు రోజులుగా జరిగిన పరిణామాలపై తగిన రీతిలో స్పందించాలని ప్రపంచ దేశాలను కోరారు. ఈ ప్రాంతంలోని దేశాలతో పాటు, భాగస్వామ్య పక్షాలతో విస్తృత సంప్రదింపులు జరుపుతున్నట్లు సాకి తెలిపారు. వీరంతా అమెరికాతో కలిసి పనిచేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.
భద్రతా మండలి సమావేశం
మరోవైపు, మయన్మార్ సైనిక తిరుగుబాటుపై చర్చించేందుకు ఐరాస భద్రతా మండలి మంగళవారం సమావేశం కానుంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తీసుకోగలిగే చర్యలపై దృష్టిసారించనుంది. భద్రతా మండలికి అధ్యక్షత వహిస్తున్న బ్రిటన్ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశం ఆంతరంగికంగా నిర్వహించనున్నట్లు తెలిపింది. ఐరాసకు మయన్మార్ ప్రత్యేక రాయబారి క్రిస్టినీ ష్రానర్ బుర్గెనర్ అభిప్రాయాన్ని తెలుసుకోనున్నట్లు వెల్లడించింది.
ఆంక్షలు విధించే అవకాశాన్ని పరిశీలించడంపై స్పందించిన బ్రిటన్ ప్రతినిధి బార్బరా ఉడ్‌ల్యాండ్.. ప్రస్తుతానికి నిర్మాణాత్మక చర్చలు జరపాలని యోచిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ.. నేతల విడుదల కోసం తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
"ప్రస్తుతానికి ఆంక్షల గురించి ఎలాంటి ఆలోచనలు లేవు. ముందుగా.. ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాం. ఐరాస భద్రతా మండలి ఏ రకమైన చర్యలు తీసుకోగలదనే విషయంపై చర్చిస్తాం. ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడం, రాజకీయ నేతలను విడుదల చేసేలా చూడటం, సైనిక తిరుగుబాటు, సైనిక పాలనకు చరమగీతం పాడటమే ప్రధాన లక్ష్యం."
-బార్బరా ఉడ్‌ల్యాండ్, బ్రిటన్ ప్రతినిధి
సూకీ ఆచూకీ లేదు
మరోవైపు, మయన్మార్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు.. ఇతర పరిణామాలకు దారితీస్తాయని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ప్రతినిది స్టీఫెన్ డుజారిక్ పేర్కొన్నారు. బంగ్లాదేశ్‌కు తరలివెళ్లిన శరణార్థులు స్వచ్ఛందంగా వెనక్కి రావడం ఆలస్యమవుతుందని అన్నారు. ఇతర దేశాల్లో ఉన్న రోహింగ్యాలకు ఏమవుతుందో తెలియని పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
మయన్మార్ ప్రధాని ఆంగ్ సాన్ సూకీ ఆచూకీ తమకు తెలియలేదని చెప్పారు. నేపిటాలోని ఐరాస ప్రతినిధులు ఆమెను సంప్రదించేందుకు యత్నిస్తున్నారని వెల్లడించారు. మయన్మార్ అధికారులతోనూ ఐరాస సంప్రదింపులు జరపలేకపోతోందని చెప్పారు. పరిస్థితిని మెరుగుపర్చేందుకు మయన్మార్ సైనికాధికారులతో చర్చించేందుకు గుటెరస్ సిద్ధంగానే ఉన్నారని తెలిపారు. ఈ విషయంపై అంతర్జాతీయ సమాజం ఏకాభిప్రాయంతో ఉండాలని పిలుపునిచ్చారు.
నిరసనలు
మయన్మార్‌లో తిరుగుబాటుకు వ్యతిరేకంగా జపాన్‌లో నిరసనలు జరిగాయి. రాజధాని టోక్యోలో ప్రజాస్వామ్య మద్దతుదారులు ఆందోళన చేశారు. ఐరాస కార్యాలయం ముందు ప్లకార్డులను ప్రదర్శించారు.