ఈ నెల 22 నుంచి 29 వరకూ జరగబోయే ఐక్యరాజ్య సమితి(ఐరాస) సర్వ ప్రతినిధి సభ కొత్త రికార్డు సృష్టించబోతోంది. మునుపెన్నడూ లేనంతగా ఈసారి అధిక సంఖ్యలో దేశాధిపతులు, ప్రభుత్వాధినేతలు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. ఈ విషయాన్ని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తెలిపారు.
కరోనా ప్రభావం నేపథ్యంలో ఈసారి సర్వ ప్రతినిధి సభను వర్చువల్ విధానంలో నిర్వహించనున్నారు. 75 సంవత్సరాల ఐరాస చరిత్రలో ఈ విధంగా నిర్వహించడం ఇదే తొలిసారి. ఇందుకోసం 119 దేశాల అధిపతులు, 54 మంది ప్రభుత్వాధినేతలు తమ జాతీయ సందేశాలను ముందుగానే వీడియో రికార్డు చేసి పంపించినట్లు గుటెర్రెస్ తెలిపారు. సాధారణ రోజుల్లో ఏటా న్యూయార్క్‌లో జరిగే ఐరాస సర్వ ప్రతినిధి సభకు సుమారు 70 నుంచి 80 మంది వ్యక్తిగతంగా హాజరై చర్చల్లో పాల్గొనేవారని ఆయన పేర్కొన్నారు. ఈ వీడియో సందేశాలను సర్వ ప్రతినిధి సభలో శాశ్వత ప్రతినిధుల సమక్షంలో ప్రసారం చేయనున్నట్లు తెలిపారు.
ఐరాస 75వ వసంతాలను పూర్తి చేసుకున్న సందర్భంగా 21న ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించనున్నారు. అందులో ప్రధాని నరేంద్ర మోదీ ముందే రికార్డు చేసిన వీడియో ద్వారా ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో 193 సభ్య దేశాలు 'ది ఫ్యూచర్ వుయ్ వాంట్, ది యునైటెడ్ నేషన్స్ వుయ్ నీడ్' అనే అంశంపై చర్చలు జరిపి ఓ రాజకీయ నిర్ణయాన్ని ప్రకటించనున్నాయి. 26న ప్రధాని మోదీ మరోసారి ఈ కార్యక్రమంలో వీడియో రూపంలో జాతీయ సందేశాన్ని వినిపించనున్నారు.