వెనెజువెలాలో రాజకీయ సంక్షోభం ప్రజల జీవితాలను దుర్భరం చేస్తోంది. ఇప్పటికే తీవ్ర విద్యుత్ సమస్యలను ఎదుర్కొంటున్న ఆ దేశ ప్రజలు, తాజాగా నీటి ఎద్దడితో ఇక్కట్ల పాలవుతున్నారు. కనీసం తాగునీరు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అధ్యక్షుడు నికోలస్ మదురో అధ్వాన్నంగా మారిన ప్రాథమిక సేవలను పునరుద్ధరించేందుకంటూ దేశవ్యాప్తంగా విద్యుత్ కోత విధించారు. ఫలితంగా విద్యుత్ సరఫరా తగినంతగా లేక నీటి పంపులు పనిచేయట్లేదు. రాజధాని కారకస్లోనూ ప్రజలు నీటి పంపుల వద్ద బారులు తీరుతున్నారు.
"మా సమస్యలు తీర్చమని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము. ఇది తీవ్రమైన సమస్య. విద్యుత్, నీళ్లు లేకపోవడం చాలా ఇబ్బంది కలిగిస్తోంది. ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదు." -మారా రోజా, వెనెజువెలా పౌరురాలు
చల్లారని మంటలు
వెనెజువెలాలో రాజకీయ సంక్షోభం కొనసాగుతూనే ఉంది. అధ్యక్షుడు మదురో, ప్రతిపక్ష నాయకుడు జువాన్ గైడో అధికారం కోసం పెనుగులాడుతున్నారు. దేశం ఆర్థికంగా పతనమవుతోంది. మార్చి 7 నుంచి మొదలైన విద్యుత్ సంక్షోభం నానాటికీ జఠిలమవుతోంది. విద్యుత్ సరఫరా లేక తాజాగా నీటి సమస్య మొదలైంది. రవాణా సౌకర్యాలకు ఇబ్బంది కలుగుతోంది. ఇలా వరుస సమస్యలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.