సైకో కిల్లర్ కథాంశంగా హాలీవుడ్లో ఎన్నో చిత్రాలు వచ్చాయ్. పెద్దగా కారణాలు లేకుండానే ఓ వ్యక్తి అతి కిరాతకంగా వరుస హత్యలు చేసే దృశ్యాలు... సినీ ప్రేక్షకులను భయపెడతాయి. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తాయి. అలాంటి ఓ సైకో నిజ జీవితంలో ఉంటే...?
ఎఫ్‌బీఐ చెప్పిన కథ...
శామ్యూల్ లిటిల్.... వయసు 79 ఏళ్లు. అమెరికా వాసి. 1970-2005 మధ్య ఏకంగా 93 హత్యలు చేశాడు. మృతుల్లో మహిళలే అధికం. ఈ విషయాన్ని అతడే స్వయంగా అంగీకరించాడు.
మాజీ బాక్సర్ శామ్యూల్ చెప్పిన వివరాలను తన వెబ్సైట్లో ఉంచింది అమెరికా ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్. 50 హత్యలు కచ్చితంగా శామ్యూల్ చేసినవేనని నిర్ధరించింది. మిగిలినవాటి కోసం ఆధారాలు సేకరించే పనిలో ఉంది.
అప్పటి నుంచి జైల్లోనే...
వరుస హత్యలు చేసే శామ్యూల్... తనను ఎవరూ పట్టుకోలేరని అనుకునేవాడు. తన చేతిలో చనిపోయిన వారి గురించి పెద్దగా పట్టించుకునేవారు లేరన్న నమ్మకమే ఇందుకు కారణం. కానీ... 2012లో అతడి పాపం పండింది. మాదక ద్రవ్యాల కేసులో అరెస్టయ్యాడు. డీఎన్ఏ పరీక్షలు చేయగా 1987-89 మధ్య జరిగిన 3 హత్య కేసులతో అతడికి సంబంధం ఉన్నట్లు తేలింది.
3 హత్య కేసుల్లో శామ్యూల్‌కు 2014లో జీవితఖైదు పడింది. అప్పటినుంచి జైల్లోనే ఉన్నాడు. అయితే... ప్రతి కేసులోని నిజానిజాలు తేల్చి, బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపింది ఎఫ్‌బీఐ.
ఇదీ చూడండి : ముఖానికి మాస్క్ వేసుకున్నారని ఇద్దరిపై కేసు