అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. వర్జీనియా బీచ్ మున్సిపల్ భవనంలో దుండగుడు విచక్షణారహితంగా తుపాకీతో కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో 12 మృతి చెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. వీరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో జరిగిందీ ఘటన. దుండగుడి కాల్పుల్లో ఓ పోలీసు అధికారికీ గాయాలయ్యాయి. అయితే.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అతడిని రక్షించింది.
దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు హతమార్చారు. అతడిని ప్రభుత్వ ఉద్యోగిగా అధికారులు గుర్తించారు.
అమెరికాలో చాలా రోజుల తర్వాత జరిగిన కాల్పుల ఘటనపై పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపిన వర్జీనియా గవర్నర్... ఇది భయంకరమైన రోజుగా అభివర్ణించారు. మేయర్.. దీనిని పిరికిపందల చర్యగా పేర్కొన్నారు.