హెచ్1బీ వీసాల కోసం ఈ ఏడాదీ దరఖాస్తులు వెల్లువెత్తాయి. 2019-20 ఆర్థిక సంవత్సరానికి ఇప్పటికే పరిమితికి మించి వీసా దరఖాస్తుల కోసం పిటిషన్లు వచ్చాయి.
2019-20 ఆర్థిక సంవత్సరానికి 65వేల హెచ్1బీ వీసాలు జారీ చేయాలని అమెరికా చట్టసభ నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ-యూఎస్ఐసీఎస్ ప్రక్రియ ప్రారంభించింది. హెచ్1బీ వీసాల దరఖాస్తులు జారీచేసేందుకు ఈనెల 1న పిటిషన్లు స్వీకరించడం ప్రారంభించింది.
ఐదు రోజుల్లోనే దరఖాస్తుల కోసం పరిమితికి మించి పిటిషన్లు వచ్చాయని యూఎస్ఐసీఎస్ ప్రకటించింది. అయితే ఆ సంఖ్య ఎంతో చెప్పలేదు. అనర్హుల పిటిషన్లు తిరస్కరించి, రుసుము తిరిగి పంపిస్తామని స్పష్టంచేసింది.
అడ్వాన్స్డ్ కోసం మరో లెక్క...
అమెరికా అడ్వాన్స్డ్ డిగ్రీ కోటాలో మరో 20వేల హెచ్1బీ వీసాలు ఇచ్చేందుకు వీలుంది. అందుకు సరిపడా పిటిషన్లు వచ్చాయో లేదో పరిశీలిస్తామని చెప్పింది యూఎస్ఐసీఎస్.
ఆమోదం తర్వాతే దరఖాస్తు...
అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే విదేశీయులకు హెచ్-1బీ వీసా తప్పనిసరి. ఇందుకోసం ముందుగా 'యూఎస్‌సీఐఎస్'లో పిటిషన్ దాఖలు చేయాలి. అది ఆమోదం పొందిన తరువాతే వీసాకు దరఖాస్తు చేసుకోవాలి.
ఎప్పుడూ లక్షల్లోనే...
2014-15 నుంచి 2018-19 ఆర్థిక సంవత్సరం వరకు మొదటి ఐదు రోజుల్లో అందిన పిటిషన్ల వివరాలు తెలిపారు యూఎస్‌సీఐఎస్ అధికారులు. ఈ ఏడాది అందిన పిటిషన్ల వివరాలు మాత్రం వెల్లడించలేదు.
ఆర్థిక ఏడాది పిటిషన్ల సంఖ్య
1. 2018-19 1,90,000
2. 2017-18 1,99,000
3. 2016-17 2,36,000
4. 2015-16 2,32,972
5. 2014-15 1,72,581