అమెరికా ఇప్పటికే రెండు మిలియన్ డోసుల కరోనా వైరస్ వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసినట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అన్ని రకాల పరీక్షలు పూర్తయితే.. వీటి సరఫరాకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన వెల్లడించారు.
"నిన్న వ్యాక్సిన్ అభివృద్ధికి సంబంధించిన సమావేశం జరిగింది. ఆ విషయంలో అద్భుతమైన పురోగతి సాధిస్తున్నాం. ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయి. రక్షణపరమైన తనిఖీలు పూర్తయితే, వాటి సరఫరాకు సిద్ధంగా ఉన్నాం".
డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
చికిత్సా విధానంలో మంచి పనితీరును కనబర్చుతున్నట్లు ట్రంప్ తెలిపారు. ఇటీవలే ఇదే విషయంపై శ్వేతసౌధం వైద్య సలహాదారుడు ఆంథోని ఫౌచి మాట్లాడారు. 2021 ప్రారంభానికి కొన్ని మిలియన్ డోసుల వ్యాక్సిన్లు అమెరికా వద్ద ఉండాలని ఆశిస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలోనే వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేసే అవకాశం ఉన్న ఐదు కంపెనీలను ట్రంప్ ప్రభుత్వం ఎంపిక చేసిందని న్యూయార్క్ టైమ్స్ పేర్కొంది.
అధికారులు వైరస్ గురించి పూర్తిగా అర్థం చేసుకున్నారని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే, వైరస్‌కు సంబంధించిన కీలక విషయాలు ఇంకా తెలుసుకోలేదని శాస్త్రవేత్తలు చెప్పడం గమనార్హం. అమెరికాలో ఇప్పటి వరకు 19 లక్షల మందికి పైగా కరోనా సోకగా.. 1,11,394 మంది మరణించారు.