కరోనా వైరస్ వ్యాప్తికి మీరంటే మీరే కారణమంటూ అమెరికా, చైనా పరస్పరం దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. తమ దేశ ప్రతిష్ఠ దెబ్బతినేలా చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఆపాలని పరస్పరం డిమాండ్ చేసుకుంటున్నాయి.
చైనీస్ వైరస్
కరోనా సంక్షోభానికి చైనానే మూలకారణమని చెప్పేలా అమెరికా అధికార యంత్రాంగం ఎప్పటినుంచో వ్యవహరిస్తోంది. కరోనా నుంచి గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చినప్పుడల్లా 'చైనీస్ కరోనా వైరస్' అంటోంది. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 'చైనీస్ వైరస్' అంటూ మరో అడుగు ముందుకేశారు.
"చైనీస్ వైరస్ ప్రభావంతో నష్టపోతున్న విమానయాన సంస్థలు, ఇతర పరిశ్రమలకు అమెరికా ప్రభుత్వం మద్దతుగా నిలుస్తుంది."
- డొనాల్డ్ ట్రంప్ ట్వీట్
జాత్యహంకారం
ట్రంప్ 'చైనీస్ వైరస్' వ్యాఖ్యలపై విమర్శకులు మండిపడుతున్నారు. ట్రంప్ జాత్యాహంకార వ్యాఖ్యలు చేశారని, దీని వల్ల ఆసియా-అమెరికా సమాజాల మధ్య కొనసాగుతున్న సత్సంబంధాలు దెబ్బతినవచ్చని హెచ్చరించారు.
"కరోనా కారణంగా ఆసియా-అమెరికా ప్రజలు ఇప్పటికే చాలా బాధపడుతున్నారు. మీరు వారి మధ్య మరింత చిచ్చు పెట్టేందుకు ఆజ్యం పోయాల్సిన అవసరం లేదు."
- బిల్ డి బ్లాసియో, న్యూయార్క్ మేయర్
రగడ ఇలా మొదలైంది
కరోనా మహమ్మారి చైనాలో పుట్టినప్పటికీ అక్కడ కంటే మిగతా ప్రపంచ దేశాల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయని, మరణాలు సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకటించింది. ఇంకేముంది... వెంటనే అమెరికా, చైనాల మధ్య ఘర్షణ మొదలైంది.
అమెరికా సైన్యం తీసుకొచ్చింది...!
గత వారం చైనా విదేశాంగమంత్రిత్వశాఖ అధికార ప్రతినిధి జావో లిజియన్.... అమెరికాను రెచ్చ గొట్టేలా మాండరిన్, ఇంగ్లీష్ రెండు భాషల్లోనూ ఓ ట్వీట్ చేశారు.
"కరోనా వైరస్ను(పేషెంట్ జీరో) అమెరికా సైన్యం వుహాన్కు తీసుకొచ్చింది. అమెరికా పారదర్శకంగా వ్యవహరించి, ఇందుకు సంబంధించిన డేటాను బయటపెట్టాలి. కచ్చితంగా ఈ విషయంలో అమెరికా వివరణ ఇవ్వాలి."
- జావో లిజియన్, చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి
నిందలు వేయవద్దు
అమెరికా సైన్యమే తమ దేశంలో కరోనా వైరస్ ప్రవేశపెట్టిందని చైనాలోని పలు ఛానళ్లు ప్రసారం చేశాయి. దీనిపై అమెరికా విదేశాంగమంత్రి మైక్ పాంపియో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చైనా అత్యున్నత అధికారి యాంగ్ జీచీతో ఫోన్లో మాట్లాడుతూ... నేరం అమెరికాపై మోపడానికి బీజింగ్ నాయకత్వం ప్రయత్నిస్తోందని తీవ్రస్థాయిలో ఆరోపించారు.
పాంపియో ఇంతకు ముందు చైనాను ఉద్దేశించి... సార్స్-కోవిడ్-19 లను 'వుహాన్ వైరస్'గా పదేపదే ప్రస్తావించడం గమనార్హం.
చైనా మార్కెట్లో పుట్టిందా?
చైనాలో భూమి, నీరు, ఆకాశంలో జీవించే అన్ని జీవుల మాంసం అమ్మే మార్కెట్లు ఉంటాయి. ఇక్కడ నుంచే కరోనా అనే భయంకర వైరస్ వ్యాపించినట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.
వాణిజ్యం నుంచి మానవ హక్కుల వరకు, బీజింగ్ సైనిక నిర్మాణానికి సంబంధించిన సమస్యలపై అమెరికా-చైనాల మధ్య వివాదాలు నడుస్తున్నాయి. వీటికి ఇప్పుడు కరోనా సమస్య జతకలిసింది.
ఇదీ చూడండి: కరోనా అంతు చూసిన చైనా- వుహాన్లో సాధారణ స్థితి