ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో ఐదు తాత్కాలిక సభ్యదేశాల కోసం జూన్ 17న ఎన్నికలు జరగనున్నాయి. జూన్ ప్రణాళిక జాబితాలో యూఎన్ఎస్సీ ఈ విషయాన్ని స్పష్టం చేసింది. ప్రస్తుతం మండలికి అధ్యక్షత వహిస్తున్న ఫ్రాన్స్ ఈ ఎన్నికలకు ఆమోదం తెలిపింది.
2021-22 కాలపరిమితి కోసం జరిగే ఈ ఎన్నికల్లో ఆసియా- పసిఫిక్ స్థానానికి భారత్ మాత్రమే పోటీలో ఉంది. దీంతో మండలికి భారత్ ఎన్నిక లాంఛనం కానుంది. 2021-22 కాలపరిమితికి సంబంధించి ఆసియా- పసిఫిక్ స్థానం కోసం భారత్ అభ్యర్థిత్వానికి గత ఏడాది జూన్‌లోనే చైనా, పాకిస్థాన్ సహా ఈ విభాగంలోని మొత్తం 55 దేశాలు మద్దతు తెలిపాయి.
ఏకగ్రీవమే..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఎన్నికల కోసం ఐరాస ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు 193 సభ్య దేశాల సర్వసభ్య సమావేశం ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ప్రత్యేక తీర్మానాన్ని ఆమోదించింది. అయితే ఓటింగ్‌లో కొత్త ప్రక్రియ ప్రవేశపెట్టినా.. భారత్ ఎన్నికకు వచ్చే ప్రమాదమేమీ లేదని విశ్లేషకులు చెబుతున్నారు.
భారత్ చివరిసారిగా 2011-2012లో ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా వ్యవహరించింది. అంతకుముందు 1950-51, 1967-68, 1972-73, 1977-78, 1984-85, 1991-92లో సభ్య దేశంగా ఉంది.
శాశ్వత సభ్యత్వంపై..
అయితే భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ దశాబ్దాలుగా పోరాడుతోంది. అయితే 21వ శతాబ్దపు భౌగోళిక, రాజకీయ పరిస్థితులు అందుకు సానుకూలంగా లేవు.
ఏటా 5 స్థానాలకు..
భద్రతా మండలిలోని పది తాత్కాలిక సభ్యదేశాలకు సంబంధించి.. ఏటా ఐదు స్థానాలకు రెండేళ్ల కాలపరిమితితో ఎన్నికలు జరుగుతాయి. ఈ పది స్థానాలను ప్రాంతీయత ఆధారంగా నిర్ణయిస్తారు. ఆఫ్రికా, ఆసియా దేశాలకు 5, తూర్పు ఐరోపా- 1, లాటిన్ అమెరికా, కరీబియన్- 2, పశ్చిమ ఐరోపా, మిగతా దేశాలకు కలిపి 2 స్థానాలు కేటాయిస్తారు.