'ఇప్పట్లో భారత్‌తో వాణిజ్య ఒప్పందం ఉండదు', 'భారత్‌తో బ్రహ్మాండమైన ఒప్పందం ఉంటుంది'.. ఇలా మీడియాతో ఒక మాట, బహిరంగ సభల్లో మరోమాట మాట్లాడుతున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. భారత పర్యటనకు కొద్ది రోజుల ముందు ట్రంప్ ఇలా పూటకో మాట మాట్లాడటం సర్వత్రా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో అసలు భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఉంటుందా? లేక వాణిజ్య ప్యాకేజీ తెరపైకి వస్తుందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ట్రంప్ మనసులో ఏముంది?
అమెరికా అధ్యక్షుడికి పర్యటన కోసం యావద్దేశం ఎదురుచూస్తున్న తరుణంలో భారత్‌పై మరోసారి డొనాల్డ్ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఎన్నోసార్లు భారత్‌ను సుంకాల రారాజుగా అభివర్ణించిన ఆయన... మరోసారి అదే తరహా వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటని ఆరోపించారు. కొలరాడోలో జరిగిన 'కీప్ అమెరికా గ్రేట్' ర్యాలీలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
"వచ్చే వారం నేను భారత్‌కు వెళ్తున్నా. వాణిజ్య చర్చలు జరుపుతాం. ఎన్నో ఏళ్లుగా అమెరికాపై భారత్ భారీస్థాయిలో సుంకాలు విధిస్తోంది. నాకు ప్రధాని మోదీ నిజంగా ఎంతో ఇష్టం. కాకపోతే మామధ్య కొన్ని వాణిజ్య చర్చలు జరగాల్సి ఉంది. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల్లో భారత్ ఒకటి."
--- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
ప్యాకేజీ అయినా ఉంటుందా?
డొనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటన నేపథ్యంలో వాణిజ్య ఒప్పందంపై దేశం భారీ ఆశలు పెట్టుకుంది. అయితే ప్రస్తుతానికి ఒప్పందానికి బదులు వాణిజ్య ప్యాకేజీతోనే భారత్ సరిపెట్టుకోవాల్సి ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.