అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు అధికార బదిలీ ప్రక్రియను ప్రారంభించాలని ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధికారులకు తెలిపారు. పాలనా బదిలీ ప్రక్రియను జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేషన్(జీఎస్ఏ) చేపట్టనుంది.
అధికార బదిలీకి అంగీకారం తెలిపినప్పిటికీ.. ఎన్నికల్లో ఓడినట్లు ఒప్పుకునేందుకు మాత్రం ట్రంప్ సుముఖంగా లేరు. ఎన్నికల ప్రక్రియపై పోరాడి.. విజయం సాధిస్తానంటున్నారు. అయితే దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని.. పాలనా బదలాయింపునకు ఎమిలీ మర్ఫీ బృందం అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. తన బృందానికి ఇదే విషయాన్ని చెప్పినట్లు వివరించారు.
అధికార బదిలీకి ట్రంప్ సానుకూలంగా స్పందించిన వెంటనే జనరల్ సర్వీసెస్ అడ్మినిస్ట్రేటర్ ఎమిలీ మర్ఫీ.. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన జో బైడెన్‌కు లేఖ రాశారు. అధికార బదిలీ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు అందులో పేర్కొన్నారు.
బైడెన్‌కు పాలన బదిలీ ప్రక్రియను వెంటనే చేపట్టనందుకు మర్ఫీ ఇటీవల తీవ్ర విమర్శలు కూడా ఎదుర్కొన్నారు.
ఇదీ చూడండి:జపాన్ నిర్ణయంపై ప్రపంచ దేశాల్లో గుబులు