'అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పనికిరారు' అంటూ విమర్శించిన మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా సతీమణి మిషెల్లీ ఒబామాకు దీటైన సమాధానమిచ్చారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. అధ్యక్షుడిగా బరాక్ ఒబామా విఫలమయినందుకే ప్రజలలు తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని స్పష్టం చేశారు.
"గతంలో నా జీవితం ఎంతో ఆనందంగా ఉండేది. ఒబామా చేసిన పనుల వల్లే నేను రాజకీయాల్లోకి రావల్సివచ్చింది. ఒబామా, జో బైడెన్ లే గనక ప్రజలకు పనికొచ్చే పనులు చేసుంటే.. మీ ముందు ఇలా అధ్యక్షుడిగా నేను నిలబడాల్సిన అవసరమే ఉండేదికాదు. అసలు నేను ఎన్నికల్లో పోటీ చేయాల్సిన అవసరమే రాకపోయేది."
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో దాదాపు ఎనిమిదేళ్లపాటు ఉపాధ్యక్ష పదవి చేపట్టిన జోబైడెన్.. ఇప్పుడు డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికయ్యారు. నవంబర్ 3న జరుగనున్న ఎన్నికల్లో రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి ట్రంప్ తో పోటీ పడనున్నారు. బైడెన్ ప్రచార బృందం మాజీ అధ్యక్షుడు ఒబామాను తమ పార్టీ అస్త్రంగా ప్రయోగిస్తోంది. అంతే కాదు, ట్రంప్ లక్ష్యంగా ప్రసంగాలు సిద్ధం చేశారు. ఒబామా తన ప్రసంగాల్లో ట్రంప్ పరిపాలనపై మండిపడనున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చదవండి: అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ పనికిరారు: ఒబామా