అమెరికాలో రోజుకు లక్షన్నరకుపైగా కొత్త కరోనా కేసులు నమోదవుతున్న వేళ కొవిడ్ నివారణ టీకాపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేశారు. సాధారణ ప్రజలకు టీకా ఏప్రిల్ నాటికి అందుబాటులో ఉంటుందని ప్రకటించారు. వ్యాక్సిన్ను మొదటగా వయోజనులకు, కరోనాకు ముందుండి పోరాడుతున్న సిబ్బందికి అందిస్తామన్నారు.
"క్లినికల్ పరీక్షలతోపాటు, వ్యాక్సిన్ తయారీకి సరాసరిగా 8 నుంచి 12 ఏళ్లు పడుతుంది. వేగవంతమైన చర్యల ద్వారా మేము దీన్ని కేవలం ఒక్క సంవత్సరంలోనే చేస్తున్నాము. సాధారణ ప్రజలకు ఏప్రిల్ కల్లా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుంది. చైనా వ్యాక్సిన్ కన్నా 90 శాతం బాగా పనిచేస్తుందని ఫైజర్ సోమవారం ప్రకటించింది. వ్యాక్సిన్ తయారీ, సరఫరా చేయటానికి జులైలో ఫైజర్ 1.95 బిలియన్ డాలర్లతో మా పరిపాలన విభాగం ఒప్పందం కుదుర్చుకుంది. 100 బిలియన్ డోసుల వ్యాక్సిన్ సరఫరాకి ఈ ఒప్పందం కుదుర్చుకుంది."
---డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు.
ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారి రోజ్ గార్డెన్‌లో మాట్లాడిన ట్రంప్.. జో బైడెన్ ఎన్నికను అంగీకరించలేదు. జో బైడెన్ పరిపాలన సిఫార్సు చేసే లాక్‌డౌన్‌ను తాను ఎప్పటికీ అంగీకరించనని ట్రంప్ స్పష్టం చేశారు. టీకా 90శాతం ఫలితాలను ఇస్తోందనే విషయాన్ని కావాలనే తొక్కిపట్టిన ఫైజర్.. పోలింగ్ రోజు తర్వాత ప్రకటించిందని ట్రంప్ ఆరోపించారు. యుద్ధ ప్రాతిపదికన టీకా తయారు చేయడంలేదని ఫైజర్ తనకు చెప్పి తప్పుదోవ పట్టించిందని విమర్శించారు.