అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చిరకాల మిత్రుడు రోజర్ స్టోన్‌కు 40 నెలల జైలు శిక్ష పడింది. 2016లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకు రష్యాతో కలిసి కుట్ర పన్నారని రోజర్ స్టోన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంపై నమోదైన కేసులో అమెరికా కాంగ్రెస్ దర్యాప్తును రోజర్ అడ్డుకున్నట్లు రుజువైనందున కోర్టు ఈ తీర్పును వెలువరించింది.
స్టోన్ చాలా కాలంగా ట్రంప్‌కు సహాయకుడిగా వ్యవహరిస్తున్నారు. అధ్యక్ష ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టడానికి రష్యాతో కలిసి కుట్రపన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో కొంత మంది న్యాయవాదులు.. కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో రోజర్ సాక్ష్యులను బెదిరించడం, కాంగ్రెస్‌కు అసత్యాలు చెప్పడమే కాక.. హౌస్ దర్యాప్తును అడ్డుకున్నట్లు వచ్చిన ఆరోపణలపై విచారించి కోర్టు నవంబరులో స్టోన్‌ను దోషిగా తేల్చింది.
ఈ కేసు విషయంలో రాజకీయ ఒత్తిడిని పెంచేందుకు స్టోన్ చేసిన చర్యలతో ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అమెరికా డిస్ట్రిక్ట్ కోర్టు న్యాయమూర్తి అమీ బెర్మాన్ జాక్సన్ అభిప్రాయపడ్డారు.
ట్రంప్ ఏమన్నారంటే..
తీర్పు వెలువడిన అనంతరం ట్రంప్ స్పందించారు. త్వరలోనే అన్ని అడ్డంకులనూ తొలగించుకొని స్టోన్ బయటకు వస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేకుండా నిర్ణయం తీసుకుంటే.. న్యాయస్థానానికే కళంకమని పేర్కొన్నారు. న్యాయస్థానంపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలతో పెను దుమారం రేగింది. గతంలోనూ తన మాజీ ప్రచార బాధ్యుడు పాల్ మునాపోర్టుకు పైరవీ కేసులో జ్యూరీ శిక్ష విధింపుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సన్నిహితులకే ఇలా ఎందుకు?
ఇటీవల కాలంలో ట్రంప్ సన్నిహితులతో సంబంధాలున్న సుమారు 12 మందికి జైలు శిక్ష పడడం చర్చనీయాంశంగా మారింది. వారిలో రాజకీయ నాయకులు, పన్ను ఎగవేత పోలీసు ఉన్నతాధికారులూ ఉన్నారు.
ఇదీ చూడండి: నమస్తే ట్రంప్: అధ్యక్షుడి జీవితంలోని ఆ ముగ్గురు మహిళలు...