కొవిడ్-19 టీకాల వల్ల అరుదుగా కొద్దిమందిలో ఏర్పడుతున్న రక్తపు గడ్డలకు చికిత్స చేయడానికి కెనడా శాస్త్రవేత్తలు సరికొత్త మార్గాన్ని కనుగొన్నారు. యాంటీ క్లాటింగ్ మందులు, రక్త నాళాల ద్వారా అధిక మోతాదులో ఇమ్యునోగ్లోబులిన్ (ఐవీఐజీ). ఇవ్వడం ద్వారా ఈ పరిస్థితిని నివారించొచ్చని తేల్చారు. కరోనా టీకాల్లోని అడినోవైరల్ వెక్టార్ వ్యాక్సిన్ల వల్ల అరుదుగా కొందరిలో రక్తం గడ్డకడుతోంది. దీన్ని వ్యాక్సిన్ ఇండ్యూస్ట్ ఇమ్యూన్ థ్రాంబోటిక్ థ్రాంబోసైటోపీనియా (వీఐటీటీ)గా పేర్కొంటారు. రక్తంలోని ఒక ప్రొటీన్‌పై యాంటీబాడీలు దాడి చేసినప్పుడు ఇది తలెత్తుతుంది. ఫలితంగా రక్తంలోని ప్లేట్‌లెట్లు క్రియాశీలమవుతాయి. అంతిమంగా అవి ఒకచోట పోగుపడి, గడ్డలుగా మారుతుంటాయి.
ఈ నేపథ్యంలో కెనడా శాస్త్రవేత్తలు.. రక్తం చిక్కబడకుండా చేయడానికి వాడే హెపారిన్ వల్ల తలెత్తే థ్రాంబోనైటోపీనియా (హెచ్‌ఐటీ)పై గతంలో నిర్వహించిన పరిశోధనలను మరింత ముందుకు తీసుకెళ్లారు. వీఐటీటీ, హెచ్‌ఐటీ రుగ్మతలు ఒకేలా ఉన్నాయి. ప్రామాణిక హెచ్‌ఐటీ యాంటీబాడీ పరీక్షతో వీఐటీటీని గుర్తించడం అసాధ్యం. హెచ్‌ఐటీ పరీక్షలో మార్పులు చేసి.. వీఐటీటీకి నిర్దిష్టమైన యాంటీబాడీలను గుర్తించేలా తీర్చిదిద్దారు. బాధితుల రక్త నమూనాలపై ప్రయోగశాలల్లో పరీక్షలు నిర్వహించారు. అధిక మోతాదులో ఐవీఐజీ, రక్తాన్ని పలుచగా చేసే మందులు ఇవ్వడం వల్ల ప్లేట్‌లెట్లు క్రియాశీలం కావడాన్ని అడ్డుకొని, గడ్డలను నిరోధించొచ్చని తేల్చారు. ఆస్ట్రాజెనెకా టీకా తీసుకొని, అ తర్వాత వీఐటీటీ బారినపడ్డ ముగ్గురిపై నిర్వహించిన ప్రయోగాల్లో ఇది నిర్ధారణ అయింది.
ఇదీ చదవండి : Booster Dose: మూడో డోసు మొదలుపెట్టిన రష్యా!