క్రిస్మస్ వేళ అమెరికాలో బాంబు పేలుడుకు కారణమైన వ్యక్తి ఆ ఘటనలోనే మరణించినట్లు అధికారులు తెలిపారు. తనను తాను పేల్చుకొని దాడి చేశాడని వెల్లడించారు. అతనొక్కడే ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని చెప్పారు. డీఎన్ఏ ఆధారాలతో ఆ వ్యక్తిని అంథొనీ క్విన్ వార్నర్‌గా గుర్తించారు. ఈ మేరకు దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు.
"ఈ కేసుపై విచారణ కొనసాగిస్తున్నాం. ఇంకొక వ్యక్తి దాడిలో పాల్గొన్నాడని ఇప్పటివరకైతే ఎలాంటి ఆధారాలు లభించలేదు. దాడి జరిగిన ప్రాంతంలోని సెక్యూరిటీ వీడియోలను పరిశీలించాం. ఇతర వ్యక్తులను గుర్తించలేదు."
-డగ్లస్ కోర్నెస్కీ, ఎఫ్‌బీఐ ప్రత్యేక ఏజెంట్ ఇంఛార్జీ
అయితే ఆత్మాహుతికి గల కారణం తెలియలేదని అధికారులు తెలిపారు. దాడి కోసం అదే ప్రాంతాన్ని ఎందుకు ఎంచుకున్నాడో కూడా స్పష్టత లేదని వెల్లడించారు.
దాడికి పాల్పడిన వార్నర్‌కు.. ఎలక్ట్రానిక్స్ విభాగంలో నైపుణ్యం ఉంది. నాష్విల్లోని ఓ రియల్ ఎస్టేట్ ఏజెంట్ వద్ద కంప్యూటర్ కన్సల్టెంట్‌గా పనిచేశాడు.
వాహనంలో..
ప్రజలంతా క్రిస్మస్ వేడుకల్లో మునిగిన సమయంలో టెనెస్సీలోని నాష్విల్లో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ఓ వాహనంలో భారీ పేలుడు సంభవించింది. ఒకరు మరణించగా... మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.