కొవిడ్-19కు చికిత్స చేయడానికి అమెరికా శాస్త్రవేత్తలు ఒక కొత్త మార్గాన్ని కనుగొన్నారు. వైరస్ పునరుత్పత్తిని ఇది అడ్డుకుంటుందని ఎలుకల్లో నిర్వహించిన పరిశోధనలో వెల్లడైంది. పిల్లుల్లో తలెత్తే ప్రాణాంతక కరోనా ఇన్‌ఫెక్షన్లకు చికిత్స చేయడానికి కన్సాస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు జీసీ376 అనే ప్రొటీజ్ ఇన్‌హిబిటర్ ఔషధాన్ని అభివృద్ధి చేశారు. ప్రొటీజ్ ఇన్‌హిబిటర్లు అనేవి ఒకరకం యాంటీవైరల్ ఔషధాలు. ఇవి ఎంపిక చేసిన వైరల్ ఎంజైమ్‌లకు అతుక్కోవడం ద్వారా వైరస్ పునరుత్పత్తిని అడ్డుకుంటాయి.
జీసీ376 అభివృద్ధి తర్వాత కొవిడ్ విజృంభణ మొదలు కావడం వల్ల దీన్ని అ మహమ్మారిపై ప్రయోగించాలని శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా మందును మార్చేందుకు డ్యూటరేషన్ అనే సాధనాన్ని అభివృద్ధి చేశారు. మార్పిడి చేసిన ఔషధాన్ని ఎలుకలపై పరీక్షించారు. మొదట ఈ జీవులకు కరోనా ఇన్‌ఫెక్షన్ కలిగించి, 21 గంటల తర్వాత ఈ మందునిచ్చారు. ఇది మంచి ప్రభావం చూపినట్లు గుర్తించారు. ఊపిరితిత్తుల్లో వైరస్ పునరుత్పత్తిని తగ్గించినట్లు తేల్చారు. బరువు తగ్గడం వంటి సమస్యలూ దూరమయ్యాయన్నారు.
ఇదీ చదవండి : 99 శాతం కరోనా మరణాలు వారిలోనే!