అగ్రరాజ్యం అమెరికాలో మళ్లీ 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్' నినాదాలు మార్మోగుతున్నాయి. తాజాగా లూసియానా పోలీసుల తుపాకులకు మరొక నల్లజాతీయుడు ప్రాణాలు కోల్పోవడమే ఇందుకు కారణం. ఓ స్టోర్లోకి ట్రేఫోర్డ్ పెల్లేరిన్ అనే నల్లజాతీయుడు కత్తితో వెళ్తున్నాడని అతడిని కాల్చిచంపారు పోలీసులు. ఇది ప్రస్తుతం ఘర్షణలకు దారితీసింది.
అన్యాయంగా తన కొడుకును పొట్టనబెట్టుకున్నారని మృతుడి తల్లి ఆవేదన వ్యక్తం చేశారు. ట్రేఫోర్డ్ మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని ఆమె పేర్కొన్నారు. అతడి మృతికి కారణమైన పోలీసులపై కేసు పెట్టినట్లు ఆమె తరఫు న్యాయవాది వెల్లడించారు. శుక్రవారం రాత్రి ఈ ఘటన జరగ్గా.. శనివారం భారీగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు.
ఉద్రిక్తంగా...
తొలుత నిరసనలు ప్రశాంతంగానే జరిగినా.. తర్వాత నివాస ప్రాంతాల్లో మందుగుండు పేల్చడం, రోడ్లపై వస్తువులను తగలబెట్టడం వల్ల పరిస్థితి అదుపు తప్పిందని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. దీంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు పొగబాంబులు ప్రయోగించినట్లు వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణే తమ ధ్యేయమని పేర్కొన్నారు. ఘర్షణలకు కారణమైన కొందరిని అరెస్టులు చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే వారు ఎంతమంది అనేది వెల్లడించలేదు.
ట్రేఫోర్డ్ ఘటనకు సంబంధించిన సీసీ ఫుటేజీని పరిశీలించిన ఏసీఎల్యూ, సదరన్ పోవర్టీ లా సెంటర్.. తక్షణమే విచారణకు ఆదేశించాయి.
ఇదీ చదవండి: జాతి వివక్షతో నేలరాలిన ప్రాణాలు- ఉద్భవించిన ఆశలు