అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. కొవిడ్-19పై ప్రజలకు సమాచారం అందించేందుకు వచ్చినప్పుడల్లా పక్కనే ఓ బక్కపలచటి వ్యక్తి కనిపిస్తారు. కొన్ని సందర్భాల్లో ఆయన ట్రంప్ తొందరపాటు ప్రకటనల్ని సరిచేస్తారు. ఎవరి మాటా ఓ పట్టాన వినని ట్రంప్‌ను కట్టడి చేసిన ఆ వ్యక్తిపేరు ఆంటోనీ ఫౌచి. ఆయనే ప్రస్తుతం అమెరికాకు ఆరోగ్య మార్గదర్శి. అయితే అంతటి ప్రాముఖ్యత కలిగిన వ్యక్తి పదవికి.. ఉద్వాసన పలికేందుకు ట్రంప్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
ఇదే కారణమా..?
భౌతిక దూరం, లాక్డౌన్ వంటి నిబంధనలను మొదట్లోనే అమలు చేసి ఉంటే ప్రాణనష్టం తక్కువగా ఉండేదా..? అన్న ప్రశ్నకు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఫౌచి సమాధానమిచ్చారు.
" మొదట్లోనే చర్యలు చేపట్టి ఉంటే చాలా మంది ప్రాణాలు నిలిచేవని చెప్పొచ్చు" అని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా లాక్డౌన్ ఆంక్షలు ఒక్కసారిగా సడలిస్తే కేసులు పెరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
అయితే అమెరికా అధ్యక్షుడు ముందే తగిన చర్యలు తీసుకుంటే ప్రాణ నష్టం తగ్గేదన్న ఫౌచి వ్యాఖ్యలను.. రిపబ్లికన్ పార్టీ నేత ఒకరు ఖండించారు. అంతేకాకుండా ఆయనకు ఉద్వాసన పలకాల్సిన సమయం ఆసన్నమైందని ట్వీట్ చేశారు. దాన్ని ట్రంప్ రీట్వీట్ చేయడం ఊహాగానాలకు తావిచ్చింది. ఈ నేపథ్యంలో ఫౌచి తన పదవి కోల్పోవడం ఖాయమని విశ్లేషణలు మొదలయ్యాయి.
ఫౌచీ నేపథ్యం
రొనాల్డ్ రీగన్ నుంచి ట్రంప్ వరకు ఆరుగురు అధ్యక్షుల వద్ద పనిచేసిన అనుభవం ఫౌచి సొంతం. 30 ఏళ్లుగా ప్రతి ఆరోగ్య సంక్షోభంలోనూ అమెరికాకు మార్గదర్శకుడిగా వ్యవహరించారు. ఈ క్రమంలో హెచ్‌ఐవీ, సార్స్, మెర్స్, ఎబోలా, 2001 బయో టెర్రరిజంను ఎదుర్కోవడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు. 1984లో ఎయిడ్స్ మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో అమెరికా పాటించాల్సిన విధానాలను ఫౌచినే తయారుచేశారు. ప్రస్తుతం అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్‌ఫెక్టియస్ డిసీజెస్(ఎన్‌ఐఏఐడీ) డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. అంతేకాకుండా కొవిడ్-19పై అమెరికా పోరాటంలో శ్వేతసౌధం టాస్క్‌ఫోర్స్‌లో ఫౌచి భాగస్వామి ఉన్నారు.
ఇదీ చదవండి:ట్రంప్ కూడా ఆ పెద్దాయనకు ఎదురుచెప్పడం లేదు!