Pig heart in human: వైద్యశాస్త్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మనిషికి పంది గుండెను అమర్చి శస్త్ర చికిత్స విజయవంతంగా పూర్తి చేశారు డాక్టర్లు. ఈ తరహా గుండెమార్పిడి జరగడం ప్రపంచంలోనే ఇదే తొలిసారి. అమెరికా మేరీల్యాండ్‌లోని 57ఏళ్ల డేవిడ్ బెన్నెట్‌కు ఈ ఆపరేషన్ నిర్వహించారు వైద్య నిపుణులు. గుండె సమస్య తీవ్రమై చనిపోయే పరిస్థితిలో ఉన్న అతనికి చివరి అవకాశంగా పంది గుండెను అమర్చారు. ఆపరేషన్ విజయవంతం కావడం వల్ల బెన్నెట్ ప్రాణాలు నిలిచాయి.
మూడు రోజుల గడిచినా అతనికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు. అయితే ఇంకా కొన్ని వారాల పాటు అతని ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాల్సి ఉందని వైద్యులు చెప్పారు. అతడు చాలా కాలం బతికితే భవిష్యత్తులో వైద్య రంగంలో పెను మార్పులు వస్తాయన్నారు. అవయవాల కొరత సమస్య తీర్చేందుకు ఇది కీలక ముందడుగు అవుతుందన్నారు. గుండె మార్పిడి చాలా మందికి అవసరం ఉన్నప్పటికీ అవి అందుబాటులో ఉండవని పేర్కొన్నారు.
Pig heart news
వాస్తవానికి మనిషి గుండెకు పంది గుండెకు చాలా తేడా ఉంటుంది. అయితే జన్యుపరమైన మార్పులు చేసిన తర్వాతే పంది గుండెను మానవునికి అమర్చడం సాధ్యమవుతుంది. మేరీల్యాండ్ యూనివర్సిటీ వైద్య బృందం కూడా అదే చేసింది. మానవ రోగనిరోధక వ్యవస్థల ద్వారా పంది అవయవాలను తిరస్కరించడానికి కారణమయ్యే మూడు జన్యువులను దాత పంది నుంచి తొలగించారు. పంది గుండె కణజాల పెరుగుదలను నిరోధించడానికి ఒక జన్యువును తీసుకున్నారు. రోగనిరోధక వ్యవస్థ అంగీకారానికి అవసరమయ్యే ఆరు మానవ జన్యువులను పంది గుండెలోకి చొప్పించారు.
బెన్నెట్‌కు నిర్వహించిన వైద్య పరీక్షల్లో సాధారణ గుండెమార్పిడి, కృత్రిమ గుండెను అతనిని అమర్చడం సాధ్యం కాదని తేలిందని, అందుకే పంది గుండెను ఎంచుకున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఈ ఆపరేషన్‌కు డాక్టర్ పి. గ్రిఫిత్ నేతృత్వం వహించారు.
"ఇది నాకు జీవన్మరణ సమస్య. నేను బతకాలనుకుంటున్నాను. ఇది చీకట్లో బాణం వేయడం లాంటిదని నాకు బాగా తెలుసు. కానీ నాకు మరో గత్యంతరం లేదు"
-ఆపరేషన్‌కు ముందు బెన్నెట్ చెప్పిన మాటలు
గతేడాది అక్టోబర్‌లో పంది కిడ్నీకి జన్యుమార్పులు చేసి బ్రెయిన్ డెడ్ అయిన మహిళకు అమర్చారు వైద్యులు. ఈ ఆపరేషన్ కూడా విజయమంతనైట్లు చెప్పారు. ఈ మేరకు యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ మెడికల్ సెంటర్ ప్రకటన విడుదల చేసింది.
న్యూయార్క్‌లో బ్రెయిన్ డెడ్ మహిళకు వైద్యులు విజయవంతంగా పంది కిడ్నీ అమర్చిన వార్త కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ఇదీ చదవండి: యునెస్కో వెబ్సైట్లో 'హిందీ'.. భారత్‌కు అరుదైన గౌరవం