అమెరికా క్యాపిటల్ ఘటనపై దర్యాప్తు చేసేందుకు '9/11' తరహా స్వతంత్ర కమిషన్‌ను కాంగ్రెస్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రతినిధుల సభ స్పీకర్ నాన్సీ పెలోసీ తెలిపారు. జనవరి 6న జరిగిన హింసకాండకు గల కారణాలపై దర్యాప్తు చేసి నిజానిజాలపై కమిషన్ నివేదిక అందిస్తుందని చెప్పారు. శాంతియుత అధికార బదిలీలో జోక్యంపైనా కమిషన్ విచారణ చేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు డెమొక్రటిక్ సభ్యులకు లేఖ రాసిన పెలోసీ.. క్యాపిటల్ భద్రతను పెంచేందుకు అదనపు నిధులు కేటాయించనున్నట్లు తెలిపారు.
సభ్యుల డిమాండ్లు
ఈ విషయంపై 9/11 తరహా కమిటీతో దర్యాప్తు చేయాలన్న డిమాండ్లు డెమొక్రాట్లతో పాటు రిపబ్లికన్ల నుంచీ వినిపిస్తున్నాయి. క్యాపిటల్ హింసపై ఎవరెవరి దగ్గర సమాచారం ఉంది, ఎప్పటి నుంచి ఉందనే విషయాలు బయటకు రావాలని రిపబ్లికన్ నేత, లూసియానా సెనేటర్ బిల్ కాసిడీ డిమాండ్ చేశారు. క్యాపిటల్ ముట్టడిలో ట్రంప్‌కు కొంతమేర అపరాధభావం ఉందని అభిశంసనలో ట్రంప్‌కు మద్దతుగా ఓటేసిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహమ్ చెప్పుకొచ్చారు. ఇలాంటి ఘటనలు మరోసారి జరగకూడదంటే 9/11 వంటి కమిషన్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. 9/11 కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేసేందుకు అవసరమైన ఆధారాలు ఉన్నాయని డెమొక్రటిక్ సెనేటర్ క్రిస్ కూన్స్ తెలిపారు. క్యాపిటల్‌ను మరింత సురక్షితంగా మార్చేందుకు ఈ దర్యాప్తు ఓ మార్గమని అన్నారు.
9/11 దాడి తరహా కమిషన్ ఏర్పాటు చేయాలంటే కొత్త చట్టం రూపొందించాల్సిన అవసరం ఉంటుందని తెలుస్తోంది. కమిషన్ వల్ల విచారణ అత్యున్నత స్థాయిలో జరుగుతుంది. 2001 సెప్టెంబర్ 11న అమెరికాలో జరిగిన అల్‌ఖైదా ఉగ్రదాడులపై విచారణ జరిపేందుకు '9/11' కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
ఇదీ చదవండి: 'ట్రంప్ ఆదేశాలతోనే క్యాపిటల్‌పై దాడి చేశాం'