పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు ప్రతిపాదించిన ప్రణాళికను ముస్లిం సహకార సంస్థ తిరస్కరించింది. ఈ మేరకు తాజాగా సౌదీలోని జెద్దా నగరంలో గల ఓఐసీ ప్రధాన కార్యాలయంలో 57 సభ్య దేశాల ప్రతినిధులు సమావేశమై సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
150 కోట్ల ముస్లింల ఆకాంక్షలకు అనుగుణంగా ట్రంప్ ప్రతిపాదన లేదని సంస్థ తెలిపింది. ఈ విషయంలో అమెరికాకు సహరించొద్దని నిర్ణయించాయి.
"పాలస్తీనా ప్రజల ఆకాంక్షలు, హక్కులకు భంగం కలిగే విధంగా అమెరికా ప్రణాళిక ఉన్నందున దాన్ని తిరస్కరిస్తున్నాం. అంతే కాకుండా ఈ ప్రణాళిక శాంతి ప్రక్రియకు వ్యతిరేకంగా ఉంది."
-ఇస్లామిక్ సంస్థ ప్రకటన
అమెరికా శాంతి ప్రణాళిక ఇదే..
ఇజ్రాయెల్ అవిచ్ఛిన్న రాజధానిగా జెరూసలెం ఉంటుందని, పాలస్తీనా రాజధానిగా తూర్పు జెరూసలెం ఉంటుందని ట్రంప్ ప్రతిపాదించారు. ఇది చాలా సున్నితమైన విషయమైనందున ట్రంప్ ప్రతిపాదనను పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ తిరస్కరించారు.
ఇదీ చూడండి: అమెరికా వల్లనే 'కరోనా' భయం.. చైనా మండిపాటు