గాలి ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చెందే తీరును ఇట్టే అంచనా వేసే సరికొత్త గణాంక పద్ధతిని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వేర్వేరు పరిస్థితుల్లో వైరస్ ఎలా విజృంభిస్తోందో అర్థం చేసుకునేందుకు అది దోహదపడనుంది. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయానికి చెందిన భారత సంతతి శాస్త్రవేత్త రజత్ మిట్టల్ కూడా తాజా ఆవిష్కరణలో పాలుపంచుకున్నారు. తాము రూపొందించిన విధానం ద్రవగతిక శాస్త్రంలోని పలు సిద్ధాంతాల సహాయంతో పనిచేస్తుందని ఆయన తెలిపారు.
"శ్వాసక్రియా రేటును పెంచే భౌతిక శ్రమ వల్ల కరోనా వ్యాప్తి పెరుగుతుందని మేం గుర్తించాం. జనం గుమి గూడే ప్రదేశాల్లోనూ మహమ్మారి సంక్రమణ ముప్పు అధికంగా ఉంటుందని తేల్చాం. పాఠశాలలు, వ్యాయామశాలలు, మాలను పునఃప్రారంభించే విషయాన్ని పునరాలోచించుకోవాల్సిన ఆవశ్యకతను ఇవి నొక్కి చెబుతున్నాయి."
-రజత్ మిట్టల్, భారత సంతతి శాస్త్రవేత్త
వ్యక్తుల మధ్య భౌతిక దూరం ఎంతగా పెరిగితే, మహమ్మారి సంక్రమణ ముప్పు అంత గణనీయ స్థాయిలో తగ్గుతున్నట్లు తమ అధ్యయనంలో తేలిందని మిట్టల్ తెలిపారు. సాధారణ వస్త్రంతో తయారుచేసిన మాస్కులు కూడా వైరస్ నుంచి రక్షణ కల్పించగలవని వివరించారు.