ప్రపంచవ్యాప్తంగా నిరుద్యోగ సంక్షోభం భారీగా పెరుగుతోందని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. సుమారు 50 కోట్ల మంది ప్రజలు నిరుద్యోగం లేదా సరైన ఉద్యోగాలు పొందలేక సతమతమవుతున్నారని పేర్కొంది. ఈ పరిస్థితులు సామాజిక అశాంతికి కారణమవుతోంది అంతర్జాతీయ కార్మిక సంస్థ ఓ నివేదికలో తెలిపింది.
గత దశాబ్ద కాలంలో అంతర్జాతీయ నిరుద్యోగిత రేటు నిలకడగా ఉందని కార్మిక సంస్థ స్పష్టం చేసింది. ఆర్థిక మందగమనం, పెరుగుతున్న జనాభాకు తగిన ఉద్యోగాలు కల్పించలేకపోవటం వల్ల నిరుద్యోగం పెరిగిపోతోందని అభిప్రాయపడింది.
2019లో 18.8 కోట్ల మంది నిరుద్యోగులు ఉండగా.. ఈ ఏడాది ఆ సంఖ్య 19.05 కోట్లకు చేరిందని ఐఎల్ఓ అంచనా వేసింది. నైపుణ్యాలకు తగిన ఉద్యోగం కోసం అన్వేషిస్తున్న వారు ప్రపంచ వ్యాప్తంగా 28.5 కోట్ల మంది ఉన్నారని తెలిపింది. ఇది ప్రపంచ కార్మికుల శక్తిలో 13 శాతమని పేర్కొంది.
ప్రపంచ వ్యాప్తంగా 60 శాతానికి పైగా ప్రజలు తక్కువ వేతనం, సరైన ఉద్యోగ భద్రత లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ నివేదిక పేర్కొంది. 2019లో 63 కోట్లకుపైగా ప్రజలు రోజుకు 3.20 డాలర్ల కంటే తక్కువ వేతనానికి పనిచేసినట్లు వెల్లడించింది.
ముఖ్యంగా 15 నుంచి 24 మధ్య వయసు గల 26.7 కోట్ల మంది యువత ఉద్యోగం, విద్య, శిక్షణలో లేరని.. ఒకవేళ ఉన్నా కూడా వారి చదువుకు తగ్గ ఉద్యోగం లభించక ఇబ్బందులు పడుతున్నారని తెలిపింది. 2007-17 మధ్య కాలంలో జాతీయ ఆదాయంలో శ్రమకు తగ్గట్లుగా అందించే వేతనాలు సగటు 54 నుంచి 51 శాతానికి క్షీణించినట్లు నివేదికలో స్పష్టం చేసింది.
ఇదీ చదవండి: ఇట్లు.. మీ షాపులో చోరీకి యత్నించిన దొంగ!