ముంబయి బాంబు పేలుళ్ల ఘటన(2008)తో సంబంధమున్న వ్యాపారవేత్త తహవ్వుర్ రానాను అమెరికా పోలీసులు మరోసారి అరెస్ట్ చేశారు. పాకిస్థాన్ మూలాలన్న రానాను నేరస్థుల అప్పగింత కింద భారత ప్రభుత్వ అభ్యర్థన మేరకు లాస్ ఏంజలిస్ పోలీసులు అరెస్ట్ చేశారు. జైల్లో ఉన్న రానాకు కరోనా వైరస్ సోకిందని ఇటీవలే విడుదల చేశారు అధికారులు. అయితే భారత ప్రభుత్వం చేసిన అభ్యర్థన మేరకు ఈ నెల పదోతేదీన మరోసారి అరెస్ట్ చేశారు.
నేరస్థుల అప్పగింతకు సంబంధించి 1997లో భారత్‌తో కుదుర్చుకున్న ద్వైపాక్షిక ఒప్పందం మేరకు రానాను అదుపులోకి తీసుకున్నట్లు యూఎస్ అసిస్టెంట్ అటార్నీ జాన్ లులెజియాన్ కోర్టుకు తెలిపారు. ముంబయి పేలుళ్ల ఘటనతో సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రానాను .. కేంద్రం ఇప్పటికే పరారీలో ఉన్నట్లు ప్రకటించింది.
ముంబయిలో దాడులకు పాల్పడిన పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబాకు రానా సాయం అందించాడని 2011లో దోషిగా తేల్చింది చికాగో న్యాయస్థానం. ముంబయి ఘటనలో 166 మంది ప్రాణాలు కోల్పోయారు. 240 మంది గాయపడ్డారు.
ఇదీ చూడండి: భారత గగనతలంలోకి పాక్ డ్రోన్.. కూల్చిన భద్రతా దళాలు