అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అధికార, విపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. తాజాగా డెమోక్రటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి, భారత సంతతి మహిళ కమలా హారిస్‌పై విమర్శల వర్షం కురిపించారు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఆమె అంటే అమెరికా ప్రజలకు ఇష్టం లేదని పేర్కొన్నారు. అధ్యక్షురాలిగా ఎన్నికైతే అది తమ దేశానికే అవమానమని ఆరోపించారు.
దక్షిణ కరోలినాలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో డెమోక్రటిక్ పార్టీ నేతలపై విమర్శల వర్షం కురిపించారు ట్రంప్.
"అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ గెలిస్తే చైనా గెలిచినట్లే. అది అందరికి తెలిసిన విషయమే. ప్రపంచంలోనే గొప్ప ఆర్థిక వ్యవస్థను సృష్టించాం. దానిని చైనా మహమ్మారి మందగమనంలోకి నెట్టింది. సరైన ప్రణాళికతో ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టాం.
కమలా హారిస్‌ను ప్రజలు ఇష్టపడటం లేదు. ఏ ఒక్కరికి ఆమె అంటే ఇష్టం లేదు. అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా ఎప్పటికి కాలేదు. అదే జరిగితే మన దేశానికే అవమానకరం. అధ్యక్ష పోటీ నుంచి తప్పుకున్నప్పటికీ కమలాను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంచుకోవటం ఆసక్తికరంగా ఉంది.
- డొనాల్డ్ ట్రంప్, అమెరికా అధ్యక్షుడు
బైడెన్ విధానాలు అమెరికా ఖ్యాతిని తగ్గిస్తాయనే కారణంగానే ఆయన గెలవాలని చైనా కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోందని ఆరోపించారు ట్రంప్.
ఇదీ చూడండి: వ్యాక్సిన్‌పై ట్రంప్ మాటల్ని నమ్మలేం: హారిస్