రిచర్డ్ బ్రాన్సన్.. జెఫ్ బెజోస్.. ఈ కుబేరుల మధ్య నెలకొన్న పోటీతో ప్రైవేటు అంతరిక్ష యాత్రలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. తన సంస్థ బ్లూ ఆరిజిన్ రూపొందించిన స్పేస్ షిప్లో జులై 20న సోదరునితో కలిసి అంతరిక్ష యాత్రకు బయలుదేరుతున్నట్లు ప్రకటించి బెజోస్ వార్తల్లో నిలిచారు. బెజోస్‌కు తిరుగులేదనుకున్న సమయంలో.. బ్రిటన్ కుబేరుడు రిచర్డ్ బ్రాన్సన్ ఆయనకు షాక్ ఇచ్చారు. బెజోస్ కన్నా 9 రోజుల ముందే.. అంటే జులై 11న రోదసి యాత్రను విజయవంతంగా ముగించేసి సంచలనం సృష్టించారు. ఇక ఇప్పుడు బెజోస్ వంతు! ఈ నేపథ్యంలో.. రిచర్డ్- బెజోస్ యాత్రల మధ్య తేడాలేంటో ఇప్పుడు చూద్దాం..
బెజోస్ తిరుగుప్రయాణం ఎలా?
న్యూ షెపర్డ్ వ్యోమనౌక భూమిపై నుంచి నిర్దేశిత ఎత్తుకు చేరుకున్నాక బెజోస్ బృందం ప్రయాణించే క్యాప్యుల్ రాకెట్‌తో విడిపోతుంది. అనంతరం వారు భారరహిత స్థితి అనుభూతిని పొందుతారు. క్యాప్సుల్‌లో సబ్ ఆర్బిటల్కు చేరిన బెజోస్ బృందం.. భూమిని, విశ్వాన్ని క్యాబిన్ నుంచి వీక్షిస్తారు. తర్వాత క్యాప్సుల్ తిరిగి భూమికి చేరుతుంది. పెద్ద ప్యారచూట్ల సాయంతో యాత్రికులు కిందకి దిగుతారు.
పక్కా స్కెచ్..
2012 నుంచి న్యూషెపర్డ్ వ్యోమనౌకను 15సార్లు విజయవంతంగా ప్రయోగించినట్లు బ్లూ ఆరిజన్ స్పష్టం చేసింది. అయితే.. మానవసహిత ప్రయోగం మాత్రం ఇదే తొలిసారి. ఈ వ్యోమనౌకలో బెఫ్ బెజోస్‌తో పాటు ఆయన సోదరుడు మార్క్ బెజోస్ కూడా ప్రయాణించనున్నారు.
అయితే.. రోదసిలోకి వెళ్తున్న సమయంలో ఏమైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే... న్యూషెపర్డ్ వ్యోమనౌక, క్యాప్సుల్ నుంచి విడిపోయే విధంగా రాకెట్‌ను అభివృద్ధి చేసినట్లు బ్లూ ఆరిజిన్ సిబ్బంది పేర్కొన్నారు. ఈ 'ఎస్కేప్ సిస్టమ్'ను కూడా మూడు సార్లు ప్రయోగించినట్లు స్పష్టం చేశారు. క్యాప్సుల్‌లో పైలట్లు ఉండరని, అది పూర్తిగా ఆటోమేటెడ్ అని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: