అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేసిన కమిటీ.. నిధుల దుర్వినియోగానికి పాల్పడిందన్న ఆరోపణలపై ఆయన కుమార్తె ఇవాంక ట్రంప్ వాంగ్మూలాన్ని అటార్నీలు నమోదు చేశారు. వాషింగ్టన్ డీసీ అటార్నీ జనరల్ కార్యాలయంలో ఇవాంకను మంగళవారం ఇంటర్వ్యూ చేశారు. ఈ విషయం కోర్టు ఫైలింగ్‌లో వెల్లడైందని సీఎన్ఎన్ వార్తా పేర్కొంది.
స్వచ్ఛంద సంస్థకు చెందిన నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై అధికారులు ఇదివరకే కేసు నమోదు చేశారు. ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగిన సమయంలో దాదాపు 10 లక్షల డాలర్ల తప్పుడు చెల్లింపులు చేశారని అభియోగాలు మోపారు. ఇందులో భాగంగా ఇవాంక ట్రంప్, మెలానియా ట్రంప్, థామస్ బరాక్ జూనియర్(ట్రంప్ మిత్రుడు- ప్రమాణస్వీకార కమిటీ అధ్యక్షుడు) సహా పలువురికి సమన్లు జారీ చేశారు. గతనెలలో బరాక్ వాంగ్మూలాన్ని సైతం రికార్డు చేశారు.
"వాషింగ్టన్ డీసీలోని ట్రంప్ ఇంటర్నేషనల్ హోటల్లో బాల్రూం బుకింగ్ కోసం ట్రంప్ ప్రమాణస్వీకార కమిటీ 10 లక్షల డాలర్లను వెచ్చించింది. కార్యక్రమాల నిర్వహణకు ట్రంప్ కుటుంబ సభ్యులు, హోటల్ మేనేజ్మెంట్తో కలిసి నిధులను.. కమిటీ దుర్వినియోగం చేసింది."
-కార్ల్ రేసిన్, వాషింగ్టన్ డీసీ అటార్నీ జనరల్
ప్రజలకోసం తప్ప ప్రైవేటు వ్యక్తులు, సంస్థలకు ప్రయోజనం కలిగేలా నిధులను ఉపయోగించకూడదని రేసిన్ పేర్కొన్నారు. ట్రంప్ కుటుంబ వ్యాపారాలకు అనుచితంగా సమకూర్చిన నిధులను తిరిగి రాబట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
2017 జనవరిలో డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం నేపథ్యంలో పలు కార్యక్రమాలను నిర్వహించేందుకు 10.7 కోట్ల డాలర్లను కమిటీ సేకరించింది. అయితే వీటి ఖర్చులపై పలు వివాదాలు నెలకొన్నాయి.