ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య 11 రోజుల పాటు జరిగిన పోరులో తీవ్రంగా నష్టపోయిన గాజా పునర్నిర్మాణానికి పూర్తిస్థాయి సహాయ సహకారాలు అందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హామీ ఇచ్చారు. అలాగే జేరూసలెంలో ఇరు వర్గాల మధ్య జరుగుతున్న అంతర్గత ఘర్షణలు తక్షణమే ముగిసేలా చర్యలు చేపట్టాలని ఇజ్రాయెల్‌ను కోరినట్లు తెలిపారు. ఇజ్రాయెల్ భద్రతకు అమెరికా పూర్తి హామీ ఇస్తోందని.. దీంట్లో ఎలాంటి మార్పు ఉండబోదని భరోసానిచ్చారు.
రెండు రాజ్యాలే పరిష్కారం..
ఇజ్రాయెల్ ఉనికిని నిస్సందేహంగా గుర్తించినప్పుడే ఈ ప్రాంతంలో శాంతి నెలకొంటుందని నొక్కి చెప్పారు. రెండు రాజ్యాలను ఏర్పాటు చేయడమే ఈ వివాదానికి పరిష్కారమని తాము బలంగా విశ్వసిస్తున్నట్లు తెలిపారు. ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న వివాదానికి.. జేరూసలెంను ఉమ్మడి రాజధానిగా ప్రకటించి రెండింటినీ సార్వభౌమ రాజ్యాలుగా గుర్తించడమే ఏకైక పరిష్కారమార్గమన్న ప్రతిపాదన ఉంది. అయితే, అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ మాత్రం ఆయన హయాంలో ఏకపక్షంగా ఇజ్రాయెల్‌కు పూర్తిస్థాయి మద్దతు ప్రకటించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఆయనకు సలహాదారుగా ఉన్న ఆయన అల్లుడు జేర్డ్ కుష్నర్ ఈ సమస్య పరిష్కారానికి రెండు రాజ్యాల ప్రతిపాదనను అంగీకరిస్తూ ఓ బిల్లును రూపొందించారు.
అయితే, అందులో పాలస్తీనాకు పాక్షిక సార్వభౌమాధికారాన్ని కల్పించారు. పాలస్తీనా భద్రతను ఇజ్రాయెల్ చేతుల్లో పెట్టడంతో పీటముడి వీడలేదు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దీన్ని సమర్థించగా.. పాలస్తీనా నేతలు తిరస్కరించారు. తాజాగా బైడెన్ మాత్రం పూర్తిస్థాయి సార్వభౌమాధికారం కలిగిన రెండు రాజ్యాలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఇదీ చదవండి : కిడ్నాపైన ఓఎన్జీసీ అధికారి విడుదల