దేశంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. గతవారం రోజుల్లో.. అమెరికా, బ్రెజిల్ కంటే భారత్‌లోనే ఎక్కువ కేసులు బయటపడ్డాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది.
మొత్తం కేసుల సంఖ్య పరంగా మూడో స్థానంలో ఉన్న భారత్‌లో.. ఈ నెల 4 నుంచి 10 తేదీల మధ్యలో 23శాతం కేసులు, 15 శాతానికిపైగా మరణాలు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్ఓ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
వారం రోజుల్లోనే..
ఆగస్టు 4 నుంచి వారం రోజుల వ్యవధిలో దేశంలో 4,11,379 కొవిడ్ కేసులు వెలుగుచూశాయి. 6,251 మరణాలు నమోదయ్యాయి. ఈ విషయంలో తొలిస్థానంలో ఉన్న అమెరికాలో 3,69,575 కేసులు బయటపడగా.. 7,232 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో బ్రెజిల్లో 3,04,535 మంది మహమ్మారి బారినపడగా.. 6,914 మరణాలు సంభవించాయి.
24 రోజుల్లోనే 22 లక్షలకు..
దేశంలో కరోనా కేసులు లక్ష మార్క్‌ను చేరుకోవడానికి 110 రోజులు.. 10 లక్షల మార్కును దాటడానికి 59 రోజులు పట్టింది. అయితే కేసులు కేవలం 24 రోజుల్లోనే 10 లక్షల నుంచి 22 లక్షలకు పెరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. పెరుగుతున్న కేసులకు అనుగుణంగా రికవరీల సంఖ్య కూడా వేగంగా పెరగడం కాస్త ఊరట కలిగిస్తోంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా సుమారు 70 శాతం మందికి వైరస్ నయమైంది. మరణాల రేటు కూడా 1.99 శాతానికి తగ్గిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఇదీ చదవండి: 'స్థానిక పరిస్థితుల ఆధారంగా పాఠశాలలు తెరవచ్చు'