అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ఇంకా మూడు నెలలు మాత్రమే గడువు ఉంది. ఈ నేపథ్యంలో భారతీయ అమెరికన్ల ఓట్లు ఈ ఎన్నికల్లో అత్యంత కీలకమన్నారు డెమొక్రటిక్ పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షుడు థామస్ పెరెజ్. కొన్ని రాష్ట్రాల్లో వారి ఓట్లే ఫలితాలను శాసిస్తాయని తెలిపారు. మిషిగన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ సహా పలు రాష్ట్రాల్లో భారతీయ అమెరికన్ ఓటర్లు భారీగా ఉన్నట్లు చెప్పారు.
2016 అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ చేతిలో హిల్లరీ క్లింటన్ అపజయాన్ని ప్రస్తావిస్తూ మిషిగన్‌లో 10,700 ఓట్ల తేడాతో డెమొక్రటిక్ పార్టీ ఓడినట్లు గుర్తు చేశారు థామస్.
" పెన్సిల్వేనియాలో 1,56,000 భారతీయ అమెరికన్ ఓటర్లున్నారు. గత ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అక్కడ 42,000 ఓట్ల తేడాతో ఓడింది. విస్కాన్సిన్లో 37వేల ఓట్లున్నాయి. ఆ రాష్ట్రంలో 21వేల ఓట్ల వ్యత్యాసంతో ఓటమి చవిచూశాం. భారతీయ అమెరికన్ల ఓట్లు ఎన్నికల ఫలితాలను తీవ్రంగా ప్రభావితం చేస్తాయి."
-థామస్ పెరెజ్, డెమొక్రటిక్ పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షుడు
ఎన్నికలు రసవత్తరంగా సాగే 8 కీలక రాష్ట్రాల్లో 13 లక్షల మంది భారతీయ అమెరికన్ ఓటర్లు ఉన్నారని ఏషియన్-అమెరికన్ అండ్ పసిఫిక్ ఐలాండర్స్ విక్టరీ ఫండ్ ఛైర్మన్ శేఖర్ నరసింహన్ తెలిపారు.
" ఆరిజోనాలో 66వేలు, ఫ్లోరిడాలో లక్ష 93వేలు, జార్జియాలో లక్ష 50వేలు, మిషిగన్‌లో లక్షా 25వేలు, ఉత్తర అమెరికాలో లక్ష 11వేలు, పెన్సిల్వేనియాలో లక్షా 56వేలు, టెక్సాస్‌లో 4లక్షల 5వేల మంది భారతీయ అమెరికన్లు ఉన్నారు. వీరిలో 77 శాతం మంది 2016 అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున పోటీ చేసిన హిల్లరీ క్లింటన్కే ఓటు వేశారు. ఇప్పుడు నిర్వహించిన అన్ని సర్వేల్లో వీరంతా ట్రంప్ కంటే బైడెన్ వైపే ఎక్కువ మొగ్గు చూపుతున్నారు."
-శేఖర్ నరసింహన్
ఈసారి కూడా భారతీయ అమెరికన్ ఓటర్లు డెమొక్రాట్స్కే మద్దతుగా ఉంటారని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పైన చెప్పినవారిలో కనీసం 10 లక్షల మంది తమకే అనుకూలంగా ఓటు వేస్తారని అంచనా వేస్తున్నారు. వారికి చేరువయ్యేందుకు కార్యక్రమాలు చేపట్టాలని ప్రణాళికలు రూపొందిస్తున్నారు.