భారత్‌లో కొవిడ్‌కు (covid 19) సంబంధించిన పుకార్లు అత్యధికంగా పుట్టుకొచ్చాయని ఒక నివేదిక పేర్కొంది. ఇంటర్నెట్ వినియోగం, సోషల్ మీడియా వాడకం ఎక్కువగా ఉండటం.. ఇంటర్నెట్‌పై సరైన అవగాహన లేకపోవడం వంటి కారణాలతో ఈ పరిస్థితి తలెత్తిందని వివరించింది. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ లైబ్రరీ అసోసియేషన్ అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ జర్నల్ ఈ నివేదికను రూపొందించింది. మొత్తం 138 దేశాల్లో కొవిడ్-19పై ప్రచారం అయిన తప్పుడు సమాచారాన్ని విశ్లేషించి ఈ నివేదికను తయారు చేశారు. 9,657 అసత్య ప్రచారాలను ఇందుకోసం విశ్లేషించారు. మొత్తం 94 ఫ్యాక్ట్ చెక్ సంస్థలు దీనిలో భాగం అయ్యాయి.
"కొవిడ్‌పై సామాజిక మాధ్యమాల్లోని 18.07 శాతం తప్పుడు సమాచారం భారత్ నుంచి పుట్టుకొచ్చింది. భారత్‌లో అత్యధికంగా ఇంటర్నెట్, సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. వినియోగదారులకు ఇంటర్నెట్ పరిజ్ఞానం కూడా తక్కువే" అని నివేదిక వెల్లడించింది. అత్యధికంగా తప్పుడు సమాచారానికి ప్రజలు ప్రభావితమైన దేశాల్లో భారత్, అమెరికా, బ్రెజిల్, స్పెయిన్ ఉన్నాయి. అత్యధికంగా తప్పుడు సమాచారం సృష్టించిన వాటిల్లో 84శాతం వాటాతో సోషల్ మీడియా ఉంది. ఇక అత్యధికంగా పుకార్ల సృష్టికి కారణమైన దానిలో ఇంటర్నెట్ 90.5 శాతంతో ముందుంది. ఫేస్‌బుక్‌లో కొవిడ్‌పై అత్యధికంగా 66.87 శాతం తప్పుడు సమాచారం ప్రచారమైంది.
ఇదీ చూడండి : C.1.2 Variant: భారత్‌లో ప్రమాదకర మ్యు, సీ.1.2. కేసులున్నాయా?