ప్రపంచ వేదికపై భారత్ కీలక పాత్ర పోషిస్తోందని అమెరికా పర్యావరణ రాయబారి జాన్ కెర్రీ కొనియాడారు. భారత్ చేపట్టే నిర్ణయాత్మక కార్యచరణ.. రానున్న తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. లింగ సమానత్వం, మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహిస్తే ఆర్థికవ్యవస్థ వృద్ధి చెందడం సహా వాతావరణ సంక్షోభాన్ని కట్టడి చేయడానికి దోహదపడుతుందని తెలిపారు. ఈ మేరకు సౌత్ ఏసియా విమెన్ ఇన్ ఎనర్జీ(ఎస్ఏడబ్ల్యూఐఈ) వర్చువల్ సదస్సులో ఆయన మాట్లాడారు.
"భాగస్వామ్య దేశాలతో ఇప్పుడు భారత్ తీసుకునే నిర్ణయాత్మక చర్య.. రానున్న తరాలకు మార్గదర్శకంగా నిలుస్తుంది. వాతావరణ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఒక సత్వర కార్యాచరణ ప్రణాళిక మనకు కావాలి. ప్రస్తుత ఆరోగ్య, వాతావరణ సంక్షోభాలు.. మహిళలపై అసమాన ప్రభావం చూపెట్టాయి. వ్యాపార ప్రాధాన్యతల్లో మహిళలకు ముఖ్య స్థానం కల్పించేలా లింగ సమానత్వం అవసరం. మహిళలు తమ సామర్థ్యానికి తగ్గట్టుగా ఎదిగేందుకు అవసరమైన పని వాతావరణాన్ని కల్పించాలి."
-జాన్ కెర్రీ, అమెరికా పర్యావరణ రాయబారి.
ఎస్ఏడబ్ల్యూఐఈ సదస్సును అమెరికా-భారత వ్యూహాత్మక భాగస్వామ్య ఫోరమ్(యూఎస్ఐఎస్పీఎఫ్), యూనైటెడ్ స్టేట్స్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సంయుక్తంగా నిర్వహించాయి.
వాతావరణ మార్పులను కట్టడి చేయటంలో భారత్- అమెరికా సహకారం గురించి జాన్ కెర్రీ ప్రసంగించారు.
ఇదీ చూడండి:బ్రెజిల్లో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు